‘బీఆర్ఎస్‌ను మళ్లీ అధికారంలోకి రానివ్వను’.. కేసీఆర్‌పై సీఎం రేవంత్ ఘాటు వ్యాఖ్యలు

ప్రతిపక్షం, జూలై 19: ప్రజాకవి డాక్టర్ అందెశ్రీ స్మారక సభలో ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. తెలంగాణ ప్రజలు తిరస్కరించిన పాలనకు మళ్లీ అవకాశం ఇవ్వబోమని స్పష్టం చేస్తూ, రాష్ట్రంలో బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి వచ్చే పరిస్థితి ఉండదని అన్నారు.

“తులసివనం లాంటి తెలంగాణలో మళ్లీ గంజాయి మొక్కను మొలకెత్తనివ్వం. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని ఎదుర్కొనే ధైర్యం లేక అసెంబ్లీకి రాకుండా ఇంట్లోనే ఉండి కుట్రలు చేస్తారా?” అంటూ కేసీఆర్‌ను ఉద్దేశించి విమర్శలు గుప్పించారు.

తెలంగాణ సమాజం గతంలో నిజాం పాలనను కూడా అంతం చేసిందని గుర్తు చేసిన సీఎం, ప్రజలకు వ్యతిరేకంగా వ్యవహరించే ఏ రాజకీయ శక్తినైనా ప్రజలే తిరస్కరిస్తారని అన్నారు. “220 ఏళ్లు పాలించిన నిజాంనే తెలంగాణ సమాజం మట్టిలో కలిపింది. అలాంటప్పుడు మీరు ఎంత? మీ రాజకీయ బలం ఎంత?” అంటూ ప్రశ్నించారు.

తాను ప్రజల ఆశీస్సులు ఉన్నంతకాలం బీఆర్ఎస్‌ను మళ్లీ అధికారంలోకి రానివ్వనని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. “నేను ఉన్నంతవరకు మీ ప్రభుత్వం మరోసారి రాదు. గజ్వేల్‌లోనే మీ రాజకీయాలకు సమాధి కట్టే బాధ్యత నాది” అంటూ ఘాటుగా వ్యాఖ్యానించారు.

తెలంగాణ ప్రజలు అభివృద్ధి, పారదర్శక పాలనకు మద్దతు ఇస్తున్నారని, ప్రజా ప్రభుత్వం వారి ఆకాంక్షలకు అనుగుణంగా ముందుకు సాగుతుందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.

Spread the love

Related News

Latest News