ప్రతిపక్షం, జూలై 15: 2047 నాటికి తెలంగాణను 1 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా అభివృద్ధి చేయడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. భారత్ ఫ్యూచర్ సిటీలో అమెజాన్ డేటా సెంటర్ నిర్మాణానికి శంకుస్థాపన చేసిన సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
‘తెలంగాణ రైజింగ్–2047’ విధానం పెట్టుబడులు, పరిశ్రమలకు అత్యంత అనుకూలంగా రూపొందించామని సీఎం తెలిపారు. ప్రపంచ స్థాయి సంస్థలను ఆకర్షించేలా పారిశ్రామిక విధానాలను అమలు చేస్తున్నామని, భారీ పెట్టుబడుల ద్వారా రాష్ట్రంలో ఉపాధి అవకాశాలు పెరుగుతాయని పేర్కొన్నారు.
కాలుష్య నియంత్రణకు ప్రాధాన్యం ఇస్తూ ఎలక్ట్రిక్ వాహనాల (EV) రిజిస్ట్రేషన్‌పై జీరో ట్యాక్స్ అమలు చేస్తున్నామని వెల్లడించారు. హైదరాబాద్‌ను అభివృద్ధి చేస్తూనే ఢిల్లీ, ముంబై, బెంగళూరు, చెన్నై వంటి మహానగరాల్లో ఎదురవుతున్న ట్రాఫిక్, కాలుష్యం, మౌలిక వసతుల సమస్యలు రాకుండా ముందస్తు ప్రణాళికతో నగరాన్ని తీర్చిదిద్దుతున్నామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.


















