నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. 1,500 ఆర్టీసీ కండక్టర్ పోస్టుల భర్తీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్

ప్రతిపక్షం, జూలై 09: తెలంగాణలో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. రాష్ట్రవ్యాప్తంగా 1,500 ఆర్టీసీ కండక్టర్ పోస్టుల భర్తీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో నియామక ప్రక్రియ వేగం పుంజుకోనుంది. ఈ పోస్టుల భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్‌ను త్వరలో విడుదల చేసేందుకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీఎస్‌ఆర్టీసీ) యాజమాన్యం సన్నాహాలు ప్రారంభించింది.

ప్రాథమిక సమాచారం ప్రకారం, అభ్యర్థుల ఎంపికను పదో తరగతి (ఎస్‌ఎస్‌సీ)లో సాధించిన మార్కుల ఆధారంగా నిర్వహించే అవకాశముంది. అయితే గతంలో పదో తరగతి పరీక్షలు రాసిన అభ్యర్థులకు మార్కుల విధానం ఉండగా, ఇటీవలి సంవత్సరాల్లో పరీక్షలు రాసిన వారికి గ్రేడింగ్ విధానం అమల్లో ఉంది. దీంతో ఎంపిక ప్రక్రియలో అందరికీ సమాన అవకాశాలు కల్పించే విధానంపై అధికారులు కసరత్తు చేస్తున్నారు.

ఈ నేపథ్యంలో గ్రేడింగ్ విధానాన్ని మార్కుల శాతంగా ఎలా మార్చాలనే అంశంపై స్పష్టత కోరుతూ ఆర్టీసీ యాజమాన్యం ఎస్‌ఎస్‌సీ బోర్డుకు లేఖ రాసినట్లు సమాచారం. బోర్డు నుంచి మార్గదర్శకాలు అందిన తర్వాత ఎంపిక విధానాన్ని ఖరారు చేసి నియామక నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం ఉందని అధికార వర్గాలు చెబుతున్నాయి.

ఈ నియామకాల ద్వారా రాష్ట్రవ్యాప్తంగా ఖాళీగా ఉన్న కండక్టర్ పోస్టులను భర్తీ చేయడంతో పాటు ప్రయాణికులకు మరింత మెరుగైన సేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యంగా భావిస్తున్నారు. నోటిఫికేషన్ విడుదలైన తర్వాత అర్హతలు, వయోపరిమితి, ఎంపిక విధానం, దరఖాస్తు ప్రక్రియకు సంబంధించిన పూర్తి వివరాలను టీజీఎస్‌ఆర్టీసీ అధికారికంగా ప్రకటించనుంది.

Spread the love

Related News

Latest News