[t4b-ticker]

కేశవాపూర్‌ను ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతాం.. సోలార్ మోడల్ విలేజ్‌గా అభివృద్ధి: మంత్రి పొన్నం ప్రభాకర్

ప్రతిపక్షం, ఆగస్టు 20, హనుమకొండ: కేశవాపూర్ గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతామని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఎల్కతుర్తి మండలంలోని కేశవాపూర్ గ్రామంలో నిర్వహించిన ‘పల్లె పల్లెకు పొన్నం అన్న.. పల్లె పల్లెలో ప్రజా పాలన’ కార్యక్రమంలో మంత్రి పాల్గొని గ్రామ ప్రజలు, రైతుల నుంచి నేరుగా వినతిపత్రాలు స్వీకరించారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి, సాధ్యమైనంత త్వరగా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.

ప్రజా పాలన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కేశవాపూర్ గ్రామంలో అమలైన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను మంత్రి సమీక్షించారు. గ్రామంలో ప్రస్తుతం 506 పెన్షన్లు అందుతుండగా, వాటి కోసం సంవత్సరానికి సుమారు రూ.1.44 కోట్ల నిధులు విడుదలవుతున్నాయని అధికారులు వివరించారు. మొదటి దశలో 22 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు కాగా, వాటి నిర్మాణాలు ప్రస్తుతం పూర్తి దశకు చేరుకున్నాయని తెలిపారు. రెండో దశలో మరిన్ని ఇళ్లకు త్వరలో అనుమతులు జారీ చేయనున్నట్లు వెల్లడించారు.

గ్రామంలోని 526 కుటుంబాలకు నెలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందుతున్నట్లు అధికారులు తెలిపారు. మరో 630 కుటుంబాలకు గ్యాస్ సబ్సిడీ ప్రయోజనం లభిస్తోంది. మహిళా సంఘాలను ఆర్థికంగా బలోపేతం చేసే చర్యల్లో భాగంగా 86 మహిళా సంఘాలకు రూ.49.67 లక్షల వడ్డీలేని రుణాలు మంజూరయ్యాయి. అలాగే 72 మహిళా సంఘాలకు బ్యాంకు అనుసంధానం ద్వారా రూ.16.96 కోట్ల రుణాలు విడుదలైనట్లు అధికారులు వివరించారు.

వ్యవసాయ రంగానికి ప్రభుత్వం అందిస్తున్న సహాయాన్ని కూడా అధికారులు వివరించారు. 11 మంది ఆయిల్‌ఫామ్ రైతులకు రూ.53 లక్షల సహాయం అందించగా, 5,486 మంది రైతులకు రైతు భరోసా కింద రూ.5.03 కోట్ల నిధులు విడుదలయ్యాయి. ఏడుగురు రైతులకు రైతు బీమా కింద రూ.35 లక్షలు, 447 మంది రైతులకు రూ.3.91 కోట్ల రైతు రుణమాఫీ ప్రయోజనం అందింది. 192 మంది రైతులకు రూ.44.82 లక్షల సన్నవడ్ల బోనస్‌ కూడా విడుదల చేసినట్లు తెలిపారు.

గ్రామంలో 150 కొత్త రేషన్ కార్డులు జారీ చేయడంతో పాటు 365 భూ భారతి దరఖాస్తులను పరిష్కరించారు. 45 మంది లబ్ధిదారులకు కళ్యాణలక్ష్మి, ఇద్దరికి షాదీ ముబారక్‌ పథకాల కింద చెక్కులు అందించినట్లు అధికారులు వెల్లడించారు. గ్రామంలో అమలవుతున్న సంక్షేమ పథకాలతో పాటు మౌలిక వసతుల అభివృద్ధిపై కూడా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తోందని మంత్రి పేర్కొన్నారు.

రహదారుల అభివృద్ధికి ప్రాధాన్యం

కేశవాపూర్ నుంచి గూడూరు, అంబాల, పెంబర్తి గ్రామాలకు వెళ్లే రహదారులను అభివృద్ధి చేయాలని గ్రామస్థులు మంత్రిని కోరారు. కేశవాపూర్ ఎస్సీ కాలనీ వరకు సీసీ రోడ్డు, పెద్దమ్మ గుడి నుంచి చర్చి వరకు సీసీ రోడ్డు నిర్మాణంతో పాటు గ్రామంలోని ఇతర ప్రాంతాల్లో విడతల వారీగా సీసీ రోడ్లు ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. గతంలో నిర్మించిన నందిపయ్య కాలువను పునరుద్ధరించాలని, రెండు పెద్ద చెరువులకు బౌండరీ ఏర్పాటు చేయాలని, గ్రామ శివారులో గతంలో ఉన్న బైపాస్ రహదారిని పునరుద్ధరించాలని కోరారు.

ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. గుంటూరు పల్లె నుంచి కేశవాపూర్ వరకు రూ.3.5 కోట్లతో రహదారి పనులు మంజూరయ్యాయని తెలిపారు. కేశవాపూర్ నుంచి అంబాల, పెంబర్తి వరకు రహదారి అభివృద్ధి పనులతో పాటు శివాలయ అభివృద్ధికి కూడా చర్యలు తీసుకుంటామని చెప్పారు.

ఇందిరమ్మ ఇళ్లకు ప్రాధాన్యం

గత ప్రభుత్వ హయాంలో కేశవాపూర్‌కు ఒక్క ఇందిరమ్మ ఇల్లు కూడా మంజూరు కాలేదని మంత్రి పేర్కొన్నారు. ప్రజల ఆశీర్వాదంతో ఏర్పడిన ప్రజా పాలన ప్రభుత్వం పేదల సొంతింటి కలను నెరవేర్చేందుకు కృషి చేస్తోందన్నారు. గుడిసెల్లో నివసిస్తున్న కుటుంబాలకు ప్రాధాన్యం ఇవ్వడంతో పాటు గతంలో ఇళ్లు మంజూరై నిర్మాణాలు మధ్యలో నిలిచిపోయిన లబ్ధిదారులకు కూడా ప్రభుత్వం సహకరిస్తుందని తెలిపారు.

హుస్నాబాద్ నియోజకవర్గంలో మొదటి దశలో 3,500 ఇందిరమ్మ ఇళ్లు, రెండో దశలో మరో 2,000 ఇళ్లు మంజూరు చేస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. అర్హులైన ప్రతి కుటుంబానికి ప్రభుత్వ పథకాల ప్రయోజనం అందేలా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

నీటి సంరక్షణపై ప్రత్యేక దృష్టి

గ్రామాభివృద్ధి నిరంతర ప్రక్రియ అని మంత్రి పేర్కొన్నారు. తక్కువ వర్షపాతం పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ‘జల సిరి’ కార్యక్రమం ద్వారా నీటి సంరక్షణ చర్యలను విస్తృతంగా చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ప్రతి ఇంటి వద్ద ఇంకుడు గుంతలు, బోర్ ఇంజెక్షన్ పాయింట్లు, వాటర్ పిట్లు ఏర్పాటు చేసుకోవాలని గ్రామస్థులకు సూచించారు. భవిష్యత్తులో నీటి కొరత సమస్య తలెత్తకుండా ఇప్పటి నుంచే వర్షపు నీటిని సంరక్షించుకోవాల్సిన అవసరం ఉందన్నారు.

ఆయిల్‌ఫామ్ సాగుతో రైతులకు స్థిరమైన ఆదాయం

రైతులు ఆయిల్‌ఫామ్ సాగు వైపు ముందుకు రావాలని మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు. ఆయిల్‌ఫామ్ సాగుతో కోతుల బెడద తగ్గడంతో పాటు తక్కువ వర్షపాతం ఉన్న పరిస్థితుల్లో కూడా రైతులకు స్థిరమైన ఆదాయం లభించే అవకాశం ఉంటుందని తెలిపారు. ఎకరాకు ఏడాదికి రూ.లక్షకు తక్కువ కాకుండా ఆదాయం పొందే అవకాశం ఉందన్నారు.

కేశవాపూర్ గ్రామంలో 300 ఎకరాల్లో ఆయిల్‌ఫామ్ సాగు చేపడితే గ్రామాభివృద్ధికి రూ.10 లక్షలు మంజూరు చేస్తానని మంత్రి హామీ ఇచ్చారు. రైతులకు మార్కెటింగ్ సౌకర్యాలు కల్పించేందుకు గ్రామంలో సబ్ మార్కెట్ యార్డు ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు.

సోలార్ మోడల్ విలేజ్‌గా కేశవాపూర్

ఎల్కతుర్తి మండలంలో కేశవాపూర్‌ను సోలార్ మోడల్ విలేజ్‌గా ఎంపిక చేసినట్లు మంత్రి ప్రకటించారు. గ్రామంలోని ప్రతి ఇంటికి సోలార్ విద్యుత్ అందించడంతో పాటు సోలార్ పంపుల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. అవసరానికి సరిపడా విద్యుత్‌ను వినియోగించుకోవడంతో పాటు అదనంగా ఉత్పత్తి అయ్యే విద్యుత్‌ను విక్రయించుకునే అవకాశాన్ని కూడా కల్పిస్తామని చెప్పారు.

హుస్నాబాద్ నియోజకవర్గంలో కేశవాపూర్‌ను అన్ని రంగాల్లో ముందుండే గ్రామంగా తీర్చిదిద్దుతామని మంత్రి స్పష్టం చేశారు. గ్రామాభివృద్ధిలో ప్రజల భాగస్వామ్యం కూడా కీలకమని, ప్రజలు తమ సమస్యలను నేరుగా అధికారుల దృష్టికి తీసుకురావాలని సూచించారు.

కొత్త పెన్షన్లకు దరఖాస్తులపై సూచన

వితంతువులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులు, గీత కార్మికులు, చేనేత కార్మికులు, బోదకాలు, తలసేమియా, హెచ్‌ఐవీ బాధితులు తదితర అర్హులు కొత్త పెన్షన్ల కోసం దరఖాస్తు చేసుకోవాలని మంత్రి సూచించారు. ఈ నెల 31 వరకు దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతుందని తెలిపారు. అర్హులైన వారు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు.

మహిళలకు కుట్టు మిషన్లు.. ప్లాస్టిక్ వినియోగానికి స్వస్తి

నియోజకవర్గంలోని బీసీ మహిళలకు 1,000 కుట్టు మిషన్లు అందించే కార్యక్రమం ప్రారంభమైందని మంత్రి తెలిపారు. కేశవాపూర్‌లో మహిళా సంఘాలకు స్టీల్ సామగ్రిని అందించినట్లు చెప్పారు. మూడు మహిళా సంఘాలకు 300, 400, 500 చొప్పున స్టీల్ బ్యాంకులు అందించామని, మొత్తం 1,200 స్టీల్ సామగ్రిని అందుబాటులోకి తీసుకొచ్చామని తెలిపారు.

ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించి స్టీల్ సామగ్రిని ఎక్కువగా వినియోగించాలని మంత్రి పిలుపునిచ్చారు. నియోజకవర్గంలోని 173 గ్రామాల్లో మహిళా సంఘాలకు స్టీల్ బ్యాంకులు అందించినట్లు వెల్లడించారు. మహిళా సంఘాల ఆర్థిక బలోపేతంతో పాటు పర్యావరణ పరిరక్షణకు కూడా ఈ కార్యక్రమం ఉపయోగపడుతుందని పేర్కొన్నారు.

విద్య, వైద్యానికి ప్రాధాన్యం

ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యను పెంచేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని మంత్రి అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ విద్యా వ్యవస్థపై ప్రజల్లో నమ్మకం పెంచేలా పాఠశాలల్లో అవసరమైన సౌకర్యాలను మెరుగుపరచాలని సూచించారు.

గ్రామాల్లో డెంగ్యూ, టైఫాయిడ్, మలేరియా వంటి వ్యాధులు వ్యాప్తి చెందకుండా పారిశుధ్య చర్యలను నిరంతరం చేపట్టాలని అధికారులను ఆదేశించారు. పల్లె దవాఖానల్లో అవసరమైన అన్ని రకాల మందులు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రజలు కూడా సమయానుకూలంగా వైద్య పరీక్షలు చేయించుకుని ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలని మంత్రి కోరారు.

కేశవాపూర్ గ్రామాన్ని అభివృద్ధి, సంక్షేమం, వ్యవసాయం, విద్య, వైద్యం, మౌలిక వసతులు, సౌర విద్యుత్ వంటి అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్లడమే లక్ష్యమని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని పరిష్కరించేందుకు ఇటువంటి కార్యక్రమాలను నిరంతరం కొనసాగిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మోత్కుపల్లి శ్రీకాంత్ రెడ్డి, జిల్లా అధికారులు, వివిధ శాఖల మండల అధికారులు, ప్రజాప్రతినిధులు, రైతులు, మహిళా సంఘాల సభ్యులు, గ్రామస్థులు పాల్గొన్నారు.

Spread the love

Related News

Latest News