ప్రతిపక్షం, ఆగస్టు 13: తెలంగాణ యువతకు భారత సైన్యంలో మరిన్ని ఉద్యోగ అవకాశాలు కల్పించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం, ఆర్మీ కలిసి పనిచేయాలని నిర్ణయించాయి. ఆర్మీ నియామకాల్లో స్థానిక యువతను ప్రోత్సహించేందుకు జిల్లాల వారీగా ముందస్తు శిక్షణ కార్యక్రమాలు నిర్వహించేందుకు చర్యలు తీసుకోనున్నట్లు ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి తెలిపారు.
హైదరాబాద్‌లోని ఎంసీఆర్ హెచ్‌ఆర్‌డీలో ఉన్న బోధి పెవిలియన్‌లో ఆర్మీ సదరన్ కమాండ్ జనరల్ ఆఫీసర్ కమాండింగ్-ఇన్-చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ రాజేష్ పుష్కర్‌తో పాటు పలువురు సైనిక ఉన్నతాధికారులు ముఖ్యమంత్రిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సమావేశంలో మంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా పాల్గొన్నారు.
దేశవ్యాప్తంగా నిర్వహించే వివిధ ఆర్మీ నియామకాల్లో తెలంగాణ యువత ఎక్కువగా ఎంపికయ్యేలా ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని సీఎం సూచించారు. ఆసక్తి, అర్హత కలిగిన యువత అధికంగా ఉన్న జిల్లాలను గుర్తించి అక్కడే ముందస్తు శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేయాలని కోరారు. ఆర్మీ అధికారులు కూడా ఇందుకు సానుకూలంగా స్పందించారు. నియామకాలకు ముందుగానే జిల్లా కేంద్రాల్లో యువతకు అవసరమైన శిక్షణ అందించేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
విపత్తుల సమయంలో ఆర్మీ సేవలకు ప్రశంసలు
దేశంలో ప్రకృతి విపత్తులు, అత్యవసర పరిస్థితులు ఎదురైనప్పుడు ఆర్మీ అందిస్తున్న సేవలను ముఖ్యమంత్రి అభినందించారు. ముఖ్యంగా తెలంగాణలో వరదలు సంభవించిన సమయంలో సహాయక చర్యలు, ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడం, పునరావాస కార్యక్రమాల్లో ఆర్మీ మరింత చురుగ్గా పాల్గొనాలని కోరారు.
రాష్ట్రంలో విపత్తు పరిస్థితులు ఏర్పడినప్పుడు తక్షణమే స్పందించేలా స్థానిక ఆర్మీ అధికారులకు ఆదేశాలు ఇస్తామని లెఫ్టినెంట్ జనరల్ రాజేష్ పుష్కర్ తెలిపారు. ప్రజల రక్షణకు అవసరమైన సందర్భాల్లో రాష్ట్ర ప్రభుత్వంతో సమన్వయం చేసుకుంటూ సహాయక చర్యలు చేపడతామని పేర్కొన్నారు.
మూసీ ప్రక్షాళనపై ఆర్మీ అధికారి ప్రశంసలు
హైదరాబాద్‌లో కాలుష్యాన్ని తగ్గించడంతో పాటు చారిత్రక నగరానికి పూర్వ వైభవాన్ని తీసుకురావాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన మూసీ పునరుజ్జీవన కార్యక్రమాన్ని రాజేష్ పుష్కర్ ప్రశంసించారు. హైదరాబాద్ నగర పర్యావరణ పరిరక్షణకు మూసీ నది ప్రక్షాళన ఎంతో అవసరమని అభిప్రాయపడ్డారు.
ఈ సమావేశంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ జనరల్ ఆఫీసర్ కమాండింగ్ మేజర్ జనరల్ ఎన్. శ్రీనివాస్ రావుతో పాటు పలువురు ఆర్మీ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.





























