ప్రతిపక్షం, నవంబర్ 11: తెలంగాణలో పుట్టిన ప్రతి బిడ్డకు నాణ్యమైన విద్య అందించడమే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. తెలంగాణ విద్యార్థులు ప్రపంచస్థాయిలో పోటీపడి, అన్ని రంగాల్లో రాణించేలా విద్యావ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తీసుకొస్తున్నామని తెలిపారు. దేశంలో మరెక్కడా లేని విధంగా యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్‌తోపాటు తెలంగాణ పబ్లిక్ స్కూల్స్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన విద్యా సదుపాయాలు కల్పించి, పేద, మధ్యతరగతి కుటుంబాల పిల్లలకు నాణ్యమైన విద్యను అందుబాటులోకి తీసుకురావడమే తమ ప్రభుత్వ ఉద్దేశమని వివరించారు.
బుధవారం హనుమకొండ జిల్లాలోని కాజీపేటలో పర్యటించిన భట్టి విక్రమార్క మడికొండలో స్థానిక కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు అందించిన స్వాగతాన్ని స్వీకరించారు. అనంతరం కాజీపేటలో తెలంగాణ పబ్లిక్ స్కూల్ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలోని విద్యార్థులకు మెరుగైన విద్యతోపాటు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించేందుకు ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని చెప్పారు. విద్యారంగంలో తీసుకొస్తున్న మార్పులు భవిష్యత్తులో తెలంగాణ విద్యార్థులకు విస్తృత అవకాశాలు కల్పిస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు.
రాష్ట్రవ్యాప్తంగా 27 లక్షల మంది విద్యార్థులకు ఒకేసారి అల్పాహారం అందించే కార్యక్రమాన్ని అమలు చేస్తున్నామని ఉపముఖ్యమంత్రి తెలిపారు. ఇంత పెద్ద సంఖ్యలో విద్యార్థులకు ఏకకాలంలో బ్రేక్‌ఫాస్ట్ అందించే కార్యక్రమం దేశంలోనే కాకుండా ప్రపంచంలోనూ ప్రత్యేకమైనదని పేర్కొన్నారు. విద్యార్థులు పౌష్టికాహారం పొందితేనే చదువుపై ఏకాగ్రత పెరుగుతుందని, వారి ఆరోగ్యం, అభ్యసన సామర్థ్యం మెరుగుపడతాయని ప్రభుత్వం భావిస్తోందని తెలిపారు. విద్య, ఆరోగ్యం, పోషకాహారం వంటి అంశాలను సమగ్రంగా పరిగణనలోకి తీసుకుని పాఠశాల విద్యను బలోపేతం చేస్తున్నట్లు వివరించారు.
కాజీపేట పర్యటన అనంతరం భట్టి విక్రమార్క హనుమకొండ పరిధిలోని నక్కలగుట్టలో మైరా (MYRAA) ఆసుపత్రిని ప్రారంభించనున్నారు. ఆ తర్వాత వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి నివాసంలో ఉమ్మడి వరంగల్ జిల్లా ఎమ్మెల్యేలతో సమావేశం కానున్నారు. ఈ పర్యటనలో విద్యా రంగానికి సంబంధించిన కార్యక్రమాలతోపాటు ఇతర అభివృద్ధి, రాజకీయ అంశాలపై కూడా చర్చించే అవకాశం ఉంది.





























