[t4b-ticker]

నిమ్స్‌లో రెండున్నరేళ్లలో వెయ్యి రొబోటిక్ శస్త్రచికిత్సలు పూర్తి: సీఎం రేవంత్‌రెడ్డి

ప్రతిపక్షం, ఆగస్టు 03: హైదరాబాద్‌లోని నిజాం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (నిమ్స్) అత్యాధునిక వైద్య సేవలలో మరో కీలక మైలురాయిని చేరుకుంది. కేవలం రెండున్నరేళ్ల వ్యవధిలో 1,000 రొబోటిక్ శస్త్రచికిత్సలను విజయవంతంగా పూర్తి చేసి ప్రభుత్వ వైద్యరంగంలో కొత్త రికార్డు సృష్టించింది. ఈ ఘనతపై ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి హర్షం వ్యక్తం చేస్తూ నిమ్స్ డైరెక్టర్ డాక్టర్ రాహుల్ దేవరాజ్, వైద్యులు, నర్సింగ్ సిబ్బంది, ఆపరేషన్ థియేటర్ బృందాన్ని అభినందించారు.

ప్రభుత్వ ఆసుపత్రుల్లోనూ అత్యాధునిక వైద్య సేవలను సామాన్య ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలన్న ప్రభుత్వ లక్ష్యానికి నిమ్స్ విజయాలు నిదర్శనమని సీఎం పేర్కొన్నారు. ముఖ్యంగా ఇప్పటివరకు నిర్వహించిన రొబోటిక్ శస్త్రచికిత్సల్లో 90 శాతానికి పైగా ఆరోగ్యశ్రీ, ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) ద్వారా పేద రోగులకు ఉచితంగా అందించడం అభినందనీయమని అన్నారు.

ఇటీవలే 2,000 కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్సలను పూర్తి చేసిన నిమ్స్, ఇప్పుడు 1,000 రొబోటిక్ సర్జరీల మైలురాయిని చేరుకోవడం రాష్ట్ర వైద్యరంగానికి గర్వకారణమని సీఎం వ్యాఖ్యానించారు. నాణ్యమైన, సాంకేతిక ఆధారిత వైద్య సేవలను ప్రభుత్వ ఆసుపత్రుల ద్వారా ప్రజలకు అందించడంలో నిమ్స్ దేశవ్యాప్తంగా ఆదర్శంగా నిలుస్తోందన్నారు.

సోమవారం రాష్ట్ర సచివాలయంలో నిమ్స్ వైద్య బృందం ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహను కలిసి ఈ ఘనతకు సంబంధించిన వివరాలను తెలియజేసింది. ఈ సందర్భంగా మంత్రి కూడా వైద్య బృందాన్ని అభినందిస్తూ, ప్రభుత్వ వైద్య సేవల నాణ్యతను మరింత పెంచే దిశగా నిమ్స్ చేస్తున్న కృషిని ప్రశంసించారు.

భవిష్యత్తులో మరిన్ని అత్యాధునిక చికిత్సలను అందుబాటులోకి తీసుకువచ్చి, వైద్య రంగంలో మరిన్ని మైలురాళ్లు అధిగమించాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు.

Spread the love

Related News

Latest News