Trending Now

రైతులను నమ్మించి మోసం చేసిన కాంగ్రెస్‌..

ప్రతిపక్షం, కరీంనగర్: జిల్లాలోని అనేక ప్రాంతాల్లో పంట చేతికి వచ్చే స్థితిలో సాగునీరు లేక పంటలు ఎండిపోతున్నాయని, ఉన్న పంటలను కాపాడుకోవడానికి రైతన్నలు అష్ట కష్టాలు పడుతున్నారని, ఎన్నికల్లో రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా మోసం చేసిందని, రైతుల పట్ల కాంగ్రెస్ సర్కార్ కనికరం లేకుండా వ్యవహరిస్తుందని బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి అన్నారు. జిల్లాలో రైతులు ఎదుర్కొంటున్నా సమస్యలు పరిష్కరించాలని, కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకిచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ.. బీజేపీ జిల్లా శాఖ ఆధ్వర్యంలో సోమవారం జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ప్రకటించిన రెండు లక్షల రుణమాఫీ ఏమైంది..? రైతుబంధు రూ 15000 .. కౌలు రైతులకు రైతుబంధు ఏమైందని ప్రశ్నించారు.

ఇచ్చిన హామీలను వంద రోజుల్లో అమలు చేస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను మోసం చేసిందన్నారు. లోగడ బీఆర్ఎస్ ప్రభుత్వం రైతుల పట్ల వ్యవహరించిన విధంగానే నేడు కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తుందని ఆయన విమర్శించారు. ఇటీవల కురిసిన అకాల వర్షాలతో జిల్లాలోని అనేక ప్రాంతాల్లో పంట నష్టం జరిగిందన్నారు. గత ప్రభుత్వం పంట నష్టం అంచనా వేసి ఎకరాకు రూ.10 వేలు అందిస్తామని ప్రకటించినప్పటికీ ఇంతవరకు పరిహారం అందలేదని, వెంటనే అప్పటి పరిహారం అందించడానికి చర్యలు తీసుకోని రైతులకు ఉపశమనం కలిగించాలని ఆయన డిమాండ్ చేశారు. ఒక్కో ఎకరాకు రూ.20 నుండి రూ.30 వేల వరకు పెట్టుబడి ఖర్చులవుతున్నందున ప్రభుత్వం ప్రకటించిన రూ.10 వేల పరిహారం రైతులకు ఏమాత్రం సరిపోదని, పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.25 వేల చొప్పున నష్టపరిహారం చెల్లించి న్యాయం చేయాలని కోరారు.

యాసంగి సీజన్ వడ్ల కొనుగోళ్ల కోసం తక్షణమే పూర్తి స్థాయిలో వడ్ల కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలని, క్వింటాలుకు రూ.500 బోనస్ ప్రకటించాల ని ఇతర పంటలకు సైతం బోనస్ అందించాలనీ డిమాండ్ చేశారు. ముఖ్యంగా ప్రతి ఏటా తాలు, తేమ, తరుగు పేరుతో క్వింటాలుకు 4 నుండి 6 కిలోల చొప్పున రైతులు నష్టపోతున్నారని.. మిల్లర్లతో సంబంధం లేకుండా వడ్లను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చినందున వెంటనే ఆ మేరకు కొనుగోళ్లు చేపట్టేలా చర్యలు తీసుకోవాలన్నారు. అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రైతు కమిషన్ ను ఏర్పాటు చేయాలని.. సమగ్ర పంటల బీమాన అమలు చేసి రైతులతోపాటు రైతు కూలీలు, భూమిలేని రైతులకు సైతం బీమా పథకాన్ని వర్తింపజేయాలని కోరారు. కొత్త సాగు విధానంతోపాటు పంటల సమగ్ర ప్రణాళికను విడుదల చేయాలన్నారు. ఈ కార్యక్రమం లో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శులు తాళ్లపల్లి శ్రీనివాస్ గౌడ్, మాడ వెంకట్ రెడ్డి, బత్తుల లక్ష్మి నారాయణ, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కోమటి రెడ్డి రాంగోపాల్ రెడ్డీ, బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు సాయినీ మల్లేశం, రంగు భాస్కర్ చారి, జిల్లా అధికార ప్రతినిధిలు అలివేలు సమ్మిరెడ్డి, జానపట్ల స్వామి తదితరులు పాల్గొన్నారు.

Spread the love

Related News