ప్రతిపక్షం, జూన్ 26: కోర్టు ధిక్కరణ కేసు విచారణలో విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణా వ్యక్తిగతంగా హాజరుకాకపోవడంపై తెలంగాణ హైకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. కోర్టు నోటీసులు అందినప్పటికీ విచారణకు గైర్హాజరు కావడాన్ని తప్పుబట్టిన న్యాయస్థానం, న్యాయస్థానాలకు ఇదే గౌరవమా అంటూ ప్రశ్నించింది.
విచారణ సందర్భంగా అనంతరం యోగితా రాణా ఆన్‌లైన్ ద్వారా హాజరై తన వివరణ ఇచ్చారు. సమాచార లోపం కారణంగానే కోర్టుకు హాజరు కాలేకపోయానని తెలిపారు. ఈ విషయంలో బేషరతుగా క్షమాపణ కోరుతూ, ఇకపై ఇటువంటి పరిస్థితి పునరావృతం కాకుండా చూసుకుంటానని హామీ ఇచ్చారు.
వివరణను నమోదు చేసుకున్న హైకోర్టు కేసు విచారణను మూడు వారాలకు వాయిదా వేసింది. తదుపరి విచారణలో సంబంధిత అంశాలపై మరింతగా పరిశీలించనున్నట్లు వెల్లడించింది.
















