Trending Now

పకడ్బందీగా పదోతరగతి పరీక్షలు.. సీఎం కీలక ఆదేశం

హైదరాబాద్​, ప్రతిపక్షం స్టేట్​బ్యూరో: పదోతరగతి పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు తెలంగాణ సర్కారు ఏర్పాట్లు చేస్తోంది. పదోతరగతి పరీక్షల నిర్వహణపై ముఖ్యమంత్రి రేవంత్​రెడ్డి సీరియస్​గా తీసుకున్నారు. ఈ పరీక్షల్లో ఎలాంటి అక్రమాలు జరిగినా ప్రభుత్వానికి చెడుపేరు వస్తుందన్న దృష్ట్యా పరీక్ష కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని సీఎం ఆదేశించారు. ఈ క్రమంలోనే ఈసారి కఠిన ఆంక్షలతో పదో తరగతి పరీక్షలను నిర్వహించనున్నారు. ఎగ్జామినేషన్ సెంటర్స్ దగ్గర నో సెల్ ఫోన్ జోన్స్‌ ను ఏర్పాటు చేశారు. పరీక్ష జరిగేంత వరకూ అవసరమైతే జామర్లతో సిగ్నల్స్ ఆఫ్ చేయించే యోచనలో అధికారులు ఉన్నారు. విద్యార్థులు, ఇన్విజిలేటర్లు, స్క్వాడ్, సిబ్బందికి ఫోన్లను అందుబాటులో లేకుండా చూడనున్నారు. రూల్స్ ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని అధికారులు ఆదేశాలు జారీ చేశారు.

పరీక్ష కేంద్రం నుంచి ప్రశ్న పత్రాలు బయటికి వెళ్లకుండా, మాస్ కాపీయింగ్ జరుగకుండా కట్టుదిట్టంగా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. గత ఏడాది జరిగిన ఘటనల నేపధ్యంలో ఈ సారి పక్కాగా పరీక్షలు నిర్వహించాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. ఈ నెల 18 నుంచి ఎప్రిల్ 2 వరకు పదోతరగతి పరీక్షలు జరగనున్నాయి. 5.80 లక్షల మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నారు. పదో తరగతి పరీక్షల నిర్వహణపై అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ ఆదేశాలు జారీ చేశారు. పరీక్షలను కట్టుదిట్టంగా నిర్వహించాలని ఆదేశించారు.

Spread the love