ప్రతిపక్షం, నాగర్ కర్నూల్ బ్యూరో : ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని నాగర్ కర్నూల్ పార్లమెంట్ నియోజకవర్గం బీఎస్పీ అభ్యర్థి, మాజీ ఎంపీ మంద జగన్నాధం నామినేషన్ తిరస్కరణకు గురైంది. అయితే ఎన్నికల అధికారులు శుక్రవారం నామినేషన్ల పరిశీలన ప్రక్రియను చేపట్టారు. అయితే మంద జగన్నాధం మాత్రం తను వేసిన నామినేషన్ లో బీఎస్పీ అభ్యర్తిగా పేర్కొన్నప్పటికి బీ ఫార్మ్ సమర్పించకపోవడంతో మంద నామినేషన్ తిరస్కరణకు గురైనట్టు ఎన్నికల అధికారులు తెలిపారు. అయితే బీఎస్పీ బీ ఫార్మ్ యూసుఫ్ అనే వ్యక్తికి కేటాయించడం కొసమెరుపు. అయినా మంద జగన్నాధం స్వతంత్ర అభ్యర్థిగా పోటీలో ఉండాలనుకున్నప్పటికీ 10 మంది ఓటర్లు ఆయనను ఎంపీ అభ్యర్థి గా ప్రతిపాదించాలి. అయితే మంద జగన్నాధం పోటీ చేయడానికి కేవలం ఐదు మంది ఓటర్లు మాత్రమే ప్రతిపదించడంతో ఆయన ఎంపీ గా పోటీ చేసే అవకాశాన్ని కోల్పోయారు. మంద జగన్నాధం కాంగ్రెస్ పార్టీ నుండి టికెట్ ఆశించి బంగపడటంతో ఆయన కాంగ్రెస్ పార్టీ ని వీడి.. కొన్ని రోజుల క్రితమే బీఎస్పీ లో చేరారు. అయితే సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న మాజీ ఎంపీ మంద జగన్నాధం నామినేషన్ తిరస్కరణకు గురి కావడం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయంశంగా మారింది.