ప్రతిపక్షం, కరీంనగర్ ఏప్రిల్ 1: రైతులు తీవ్ర సంక్షోభంలో ఉన్నారని, సాగునీరు లేక పంటలు ఎండిపోతున్నాయని, రైతులకు అండగా నిలవాల్సిన కాంగ్రెస్ ప్రభుత్వం తమకు పట్టనట్లుగా వ్యవహరిస్తూ.. మొద్దు నిద్రలో ఉందని, ప్రభుత్వాన్ని మేల్కొల్పడానికి, రైతులకు భరోసా కల్పించడానికి మంగళవారం కరీంనగర్ లో రైతు దీక్ష చేపడుతున్నట్లు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ తెలిపారు. సోమవారం కరీంనగర్ లోని శుభ మంగళ గార్డెన్లో ఎన్నికల నిర్వహణ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల నిర్వహణకు సంబంధించిన బాధ్యులకు తగిన దిశా నిర్దేశం చేశారు. అనంతరం రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలపై పోరాడాలని బీజేపీ శ్రేణులకు పిలుపునిచ్చారు.
మొదటి నుండి రైతుల కొసం కొట్లాడి, రైతులకి అండగా ఉన్న పార్టీ బీజేపీ అన్నారు. నాడు కేసీఆర్ రైతాంగానికి వ్యతిరేకంగా వ్యవహరించి, వరి వేస్తే ఉరి, రైతులను గోస పెడితే ముందుండి కొట్లాడింది. బీజేపీ పార్టీని అని గుర్తు చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ విధానాలనే అవలంబిస్తుందన్నారు. సాగునీళ్లు లేక రైతులు అల్లాడుతుంటే కాంగ్రెస్ ప్రభుత్వం చోద్యం చూస్తుందని, కరువు ఉందని కుంటిసాకులు చెప్పుకుంటూ తప్పించుకోవాలని చూస్తుందన్నారు.
రైతుల కోసం అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఎన్నో హామీలు ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఏ ఒక్కటి కూడా నెరవేర్చలేదన్నారు. రైతుల 2 లక్షల రుణమాఫీ, ఎకరాకు 15 వేల రైతుబంధు, కౌలు రైతులకు రైతుబంధు ఏమైందని ఆయన ప్రశ్నించారు. కుంటి సాకులు చెప్పకుండా ఎన్నికలలో ఇచ్చిన హామీలని కాంగ్రెస్ నెరవేర్చాలన్నారు. గతంలో ముఖ్యమంత్రి హోదాలో కేసీఆర్ రామడుగు వచ్చి పంటనష్టం ఇస్తానన్న నేటి పంటనష్టం రాలేదని, కేసీఆర్ కి రైతుల గురించి మాట్లాడే అర్హత లేదని, కరీంనగర్ రైతులకి క్షమాపణ చెప్పిన తరువాతనే కరీంనగర్ లో కేసీఆర్ అడుగుపెట్టాలన్నారు. ఈ సమావేశంలో పార్లమెంట్ ఎన్నికల నిర్వహణ బాధ్యులు పాల్గొన్నారు.