రైతును రాజు చేసేందుకే ఉద్యమం.. రైతు సమస్యలపై పోరాటం తీవ్రం చేస్తాం: కవిత

ప్రతిపక్షం, జూన్ 11: తెలంగాణ రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి ప్రత్యేక కార్యాచరణతో ముందుకు సాగుతామని తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ప్రకటించారు. నల్గొండ జిల్లా కేంద్రంలోని ఓ హోటల్‌లో నిర్వహించిన రైతు సమస్యలపై రౌండ్‌టేబుల్ సమావేశంలో ఆమె పాల్గొని మాట్లాడారు.

రైతులకు న్యాయం చేయాల్సిన ప్రభుత్వాలు వ్యవసాయాన్ని నిర్లక్ష్యం చేస్తున్నాయని కవిత విమర్శించారు. వ్యవసాయాన్ని పరిశ్రమగా గుర్తించి, పారిశ్రామికవేత్తలకు కల్పించే అన్ని సౌకర్యాలను రైతులకు కూడా అందించాలని డిమాండ్ చేశారు. రైతులను ఆదుకునే విధంగా స్పష్టమైన విధానాలు, దీర్ఘకాలిక ప్రణాళికలు అవసరమని పేర్కొన్నారు.

ప్రస్తుతం రైతులపై తరుగు, రవాణా, ఇతర ఖర్చుల పేరుతో భారీ భారం మోపుతున్నారని ఆరోపించిన ఆమె, ధాన్యం కొనుగోళ్లలో రైతులు తీవ్ర నష్టాలను ఎదుర్కొంటున్నారని అన్నారు. రైతు సంక్షేమం కోసం ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.

రాష్ట్రవ్యాప్తంగా పంటల ఆధారిత ప్రత్యేక మండలాలు ఏర్పాటు చేయడం, రైతు సంఘాలను బలోపేతం చేయడం, పంటలకు సరైన మార్కెటింగ్ సౌకర్యాలు కల్పించడం అవసరమని కవిత సూచించారు. నల్గొండ జిల్లాలో బత్తాయి రైతులు, పత్తి రైతులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కోరారు.

వ్యవసాయ రంగంలో ఎరువుల కొరత, నకిలీ విత్తనాలు, నకిలీ పురుగుమందుల సమస్యలు తీవ్రంగా ఉన్నాయని పేర్కొంటూ, వీటిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కౌలు రైతులను గుర్తించి వారికి రైతు భరోసా పథకం వర్తింపజేయాలని, వ్యవసాయ కూలీలకు ప్రకటించిన ఆర్థిక సాయం అందించాలని కోరారు.

రైతు సమస్యలతో పాటు నిరుద్యోగ యువత సమస్యలను కూడా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని కవిత విమర్శించారు. ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయాలని, పోలీసు శాఖలో అన్ని ఖాళీలకు ఒకేసారి నోటిఫికేషన్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఉద్యోగాల భర్తీలో వయోపరిమితి సడలింపులు కల్పించాలని కూడా కోరారు.

రైతులు, నిరుద్యోగులు, ఉద్యమకారుల హక్కుల సాధన కోసం రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాలు చేపడతామని ప్రకటించిన కవిత, జులై 2న ఉప్పల్ ప్రాంతంలో నిర్వహించనున్న భూపోరాటానికి ప్రజలు పెద్ద ఎత్తున తరలిరావాలని పిలుపునిచ్చారు. రైతు సంక్షేమం, వ్యవసాయాభివృద్ధి, ఉద్యమకారుల హక్కుల కోసం పోరాటం కొనసాగుతుందని ఆమె స్పష్టం చేశారు.

Spread the love

Related News

Latest News