అన్ని మతాలను గౌరవించుకునే సంస్కృతి మరింత బలపడాలి
హరీశ్‌రావు,మాజీ మంత్రి
క్రైస్తవుల 21 రోజుల ఉపవాస ప్రార్థనల ముగింపు కార్యక్రమంలో పాల్గొన్న హరీశ్
ప్రతిపక్షం ప్రతినిధి, సిద్ధిపేట, సెప్టెంబర్ 27: అన్ని మతాలు, వర్గాల ప్రజలు పరస్పర గౌరవంగా అన్నదమ్ముల్లా కలిసి జీవించే సంస్కృతికి సిద్ధిపేట ప్రతీకగా నిలుస్తోందని మాజీ మంత్రి, సిద్ధిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు అన్నారు. బేతెస్థా లైట్ ఆఫ్ క్రైస్ట్ చర్చి ఆధ్వర్యంలో 21 రోజులుగా నిర్వహించిన ఉపవాస ప్రార్థనల ముగింపు కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా 21 రోజుల పాటు భక్తిశ్రద్ధలతో ఉపవాస ప్రార్థనలు నిర్వహించిన క్రైస్తవ సోదర, సోదరీమణులకు హరీశ్‌రావు హృదయ పూర్వక శుభాకాంక్షలు తెలిపారు.
ప్రార్థనతో పాటు మానవ సేవ
ఉపవాసం ఉండి 21 రోజుల పాటు ప్రార్థనలు చేయడం కేవలం ఆధ్యాత్మిక కార్యక్రమం మాత్రమే కాదని హరీశ్‌రావు అన్నారు. మనసును పవిత్రం చేసుకోవడం, ప్రేమను పెంపొందించుకోవడం, ఇతరుల కష్టాలను అర్థం చేసుకోవడం, సమాజం శాంతి సంతోషాలతో ఉండాలని కోరుకోవడం కూడా ఆధ్యాత్మికతలో భాగమేనని పేర్కొన్నారు. యేసు క్రీస్తు బోధించిన ప్రేమ, కరుణ, క్షమ, సేవ వంటి విలువలు సమాజానికి ఎప్పటికీ అవసరమని అన్నారు. ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టడం, అనారోగ్యంతో బాధపడుతున్న వారికి అండగా నిలవడం, కష్టాల్లో ఉన్న కుటుంబాలకు ధైర్యం చెప్పడం, పేద విద్యార్థుల చదువుకు సహాయం చేయడం వంటి సేవా కార్యక్రమాలు మానవత్వానికి ప్రతీకలని పేర్కొన్నారు. “మనిషి ఏ మతానికి చెందినవాడైనా కష్ట సమయంలో కావాల్సింది తోటి మనిషికి చేయూత. పరస్పర సహకారం, మానవత్వం, సోదర భావంతో సమాజం ముందుకు సాగాలి” అని హరీశ్ రావు అన్నారు.
సిద్ధిపేటలో మత సామరస్యానికి ప్రాధాన్యం
తెలంగాణలో అన్ని మతాలు, వర్గాల ప్రజలు పరస్పరం గౌరవంతో జీవించే వాతావరణం మరింత బలపడాలని హరీశ్‌రావు ఆకాంక్షించారు.సిద్ధిపేటలో అన్ని మతాల ప్రజల ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలకు గౌరవం ఇస్తున్నామని తెలిపారు. దసరా పండుగకు హిందువుల మధ్య, రంజాన్ పండుగకు ముస్లింల మధ్య, క్రిస్మస్ పండుగకు క్రైస్తవుల మధ్య ఉంటానన్నారు.
రాష్ట్రంలోనే తొలి క్రిస్టియన్ భవన్
ప్రభుత్వ నిధులతో రాష్ట్రంలోనే తొలి క్రిస్టియన్ భవనాన్ని సిద్ధిపేటలో ఏర్పాటు చేసినట్లు హరీశ్ రావు తెలిపారు. గజ్వేల్‌లో కూడా క్రిస్టియన్ భవనం ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. అన్ని మతాల పట్ల గౌరవం, సోదరభావం కొనసాగించడమే సిద్ధిపేట ప్రత్యేకత అని అన్నారు.
క్రైస్తవుల సమస్యల పరిష్కారానికి కృషి
క్రైస్తవులు సమాధుల కోసం స్థలం కేటాయించాలని కోరారని చెప్పారు. ఈ సమస్య పరిష్కారానికి తప్పకుండా కృషి చేస్తానని హరీశ్‌రావు హామీ ఇచ్చారు.21 రోజుల ఉపవాస ప్రార్థనల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరినీ అభినందించారు. వారి ప్రార్థనలు వారి కుటుంబాలకే కాకుండా సిద్ధిపేట ప్రజలందరికీ, తెలంగాణ రాష్ట్రానికి శాంతి, సుఖసంతోషాలు కలిగించాలని ఆకాంక్షించారు. మత సామరస్యం, మానవత్వం, సేవాభావం సమాజంలో మరింత బలపడేలా ప్రతి ఒక్కరూ తమ వంతు కృషి చేయాలని హరీశ్‌రావు పిలుపునిచ్చారు.































