ప్రతిపక్షం, జూలై 02: యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం ట్రస్ట్ బోర్డులో మెగాస్టార్ చిరంజీవి సతీమణి కొణిదెల సురేఖకు ప్రభుత్వం సభ్యత్వం కల్పించడంపై సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. తెలంగాణకు చెందిన ప్రముఖులకు అవకాశం ఇవ్వకుండా సురేఖను ఏ ప్రాతిపదికన ఎంపిక చేశారంటూ కొందరు నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.
మరోవైపు, దేవాదాయ బోర్డుల్లో ఇతర రాష్ట్రాలకు చెందిన ప్రముఖులు కూడా సభ్యులుగా నియమితులవుతున్నారని, తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ట్రస్ట్ బోర్డులో గతంలో తెలంగాణకు చెందిన వ్యక్తులు కూడా సభ్యులుగా ఉన్న విషయాన్ని మరికొందరు గుర్తు చేస్తున్నారు.
ప్రస్తుతం ఈ నియామకంపై సోషల్ మీడియాలో అనుకూల, ప్రతికూల అభిప్రాయాలు వ్యక్తమవుతుండగా, ప్రభుత్వం మాత్రం ట్రస్ట్ బోర్డు నియామకాలపై ఇప్పటికే అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది.

















