ప్రతిపక్షం, ఆగస్టు 16, హైదరాబాద్: తన జీవితంలో ఇక బీఆర్‌ఎస్‌తో కలిసి పనిచేసే ప్రసక్తే లేదని తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. తనను బీఆర్‌ఎస్ నుంచి ఎందుకు తొలగించారో ఇప్పటికీ తనకు అర్థం కావడం లేదన్నారు.
పార్టీలో, కుటుంబంలో తాను ఎవరితోనూ వ్యక్తిగత విభేదాలు పెట్టుకోలేదని కవిత పేర్కొన్నారు. బీఆర్‌ఎస్ సామాజిక మాధ్యమాల్లో తనను లక్ష్యంగా చేసుకున్న సమయంలోనే కొందరిపై వ్యక్తిగతంగా స్పందించాల్సి వచ్చిందని చెప్పారు. పార్టీ కోసం సైనికురాలిలా పనిచేసిన తనను చివరకు వదిలేశారని ఆవేదన వ్యక్తం చేశారు.
తనపై వచ్చిన విమర్శలు, పార్టీ నుంచి తనను తొలగించిన తీరు పట్ల కవిత అసంతృప్తి వ్యక్తం చేశారు. తాను రాజకీయంగా వెనక్కి తగ్గబోనని, ప్రజల్లోకి వెళ్లి తన రాజకీయ ప్రయాణాన్ని కొనసాగిస్తానని తెలిపారు.
తెలంగాణ రాజకీయాల్లో తనకు భవిష్యత్తు ఉందన్న నమ్మకం తనకు ఉందని కవిత ధీమా వ్యక్తం చేశారు. రానున్న రోజుల్లో ప్రజల మద్దతుతో తాను అధికారంలోకి వస్తానని ఆశాభావం వ్యక్తం చేశారు. తన రాజకీయ పోరాటాన్ని కొనసాగిస్తానని స్పష్టం చేశారు.





























