హైదరాబాద్, ప్రతిపక్షం స్టేట్బ్యూరో: విద్యార్థులకు తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు (టీటీడీ) శుభవార్త చెప్పింది. టీటీడీ విద్యాసంస్థల్లో ఎలాంటి సిఫార్సు లేఖలు లేకుండానే హాస్టల్ వసతి కల్పిస్తామని ప్రకటించింది. టీటీడీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి అధ్యక్షతన తిరుమలలోని అన్నమయ్య భవనంలో సోమవారం టీటీడీ పాలకమండలి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఇందులో భాగంగా తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో నడిచే విద్యాసంస్థల్లో ప్రవేశం పొందిన విద్యార్థినీ, విద్యార్థులకు సిఫార్సులు లేకుండానే హాస్టల్ వసతి కల్పించాలని నిర్ణయించారు. ఇందుకోసం అవసరమైతే కొత్త హాస్టళ్లను నిర్మించాలని ధర్మకర్తల మండలి సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు.
అలాగే తిరుపతి గోవిందరాజస్వామి ఆలయంలోని భాస్యకారుల సన్నిధిలోని మకర తోరణానికి, పార్థ సారథి స్వామి, కళ్యాణ వెంకటేశ్వర స్వామి తిరువాభరణాలకు బంగారు పూత పూయించాలని ధర్మకర్తల మండలి నిర్ణయించింది. ఇదే సమయంలో టీటీడీ ఆధ్వర్యంలో నడిచే ఆలయాల్లో అవసరమైన అభివృద్ధి పనులను శ్రీవాణి ట్రస్టు నిధుల ద్వారా చేపట్టేందుకు పాలన అనుమతికి ధర్మకర్తల మండలి ఆమోదం తెలిపింది. ఇటీవల ఘాట్ రోడ్డులో ప్రమాదవశాత్తు మరణించిన తిరుమల శ్రీవారి ఆలయ పరిచారిక శ్రీయతిరాజన్ నరసింహన్ కుటుంబానికి రూ.5 లక్షలు ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. అలాగే స్విమ్స్ ఆసుపత్రిలో 479 నర్స్ పోస్టుల భర్తీకి ఆమోదం తెలిపారు.