ప్రతిపక్షం, ఆగస్టు 13: హైదరాబాద్‌లో పెళ్లి రద్దు చేసుకున్న యువతిని ఓ వ్యక్తి తీవ్రంగా వేధించిన ఘటన వెలుగులోకి వచ్చింది. డేటింగ్ యాప్ ద్వారా పరిచయమైన వ్యక్తితో యువతికి నిశ్చితార్థం జరిగినట్లు సమాచారం. అనంతరం అతడు రూ.15 లక్షలు తీసుకోవడంతో పాటు అదనంగా కట్నం కోసం ఒత్తిడి చేసినట్లు బాధితురాలు ఆరోపించింది.
ఈ వేధింపులు భరించలేక యువతి కుటుంబ సభ్యులు పెళ్లిని రద్దు చేసుకున్నట్లు తెలుస్తోంది. దీంతో ఆగ్రహానికి గురైన నిందితుడు యువతిని లక్ష్యంగా చేసుకుని సామాజిక మాధ్యమాల్లో తప్పుడు ప్రచారం ప్రారంభించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. యువతి మాదకద్రవ్యాలకు బానిసైందంటూ అసత్య ఆరోపణలు చేస్తూ ఆమె పరువు తీసే ప్రయత్నం చేశాడని బాధితురాలు తెలిపింది.
అంతేకాకుండా తనపై యాసిడ్ దాడి చేస్తానని, చంపేస్తానని నిందితుడు బెదిరింపులకు పాల్పడ్డాడని యువతి ఆరోపించింది. సామాజిక మాధ్యమాల్లో తనపై జరుగుతున్న ప్రచారం, బెదిరింపులతో తీవ్ర ఆందోళనకు గురైన ఆమె పోలీసులను ఆశ్రయించింది.
బాధితురాలి ఫిర్యాదు మేరకు మల్కాజిగిరి సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితుడు సామాజిక మాధ్యమాల్లో చేసిన పోస్టులు, సందేశాలు, బెదిరింపులకు సంబంధించిన ఆధారాలను పోలీసులు సేకరిస్తున్నట్లు సమాచారం. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు దర్యాప్తులో వెల్లడయ్యే అవకాశం ఉంది.





























