ముంబై, ఢిల్లీ పర్యటనలకు సీఎం రేవంత్.. కీలక భేటీలపై ఆసక్తి

హైదరాబాద్, ప్రతిపక్షం, జూన్ 20: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రెండు రోజుల కీలక పర్యటనలో భాగంగా నేడు ముంబైకి వెళ్లనున్నారు. జాతీయవాద కాంగ్రెస్ పార్టీ అధినేత శరద్ పవార్ కుటుంబంలో జరుగనున్న వివాహ వేడుకకు ఆయన హాజరుకానున్నారు.

ఈ పర్యటన సందర్భంగా మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌తో రేవంత్ రెడ్డి సమావేశమయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఈ భేటీలో తెలంగాణకు ప్రాధాన్యమైన తుమ్మిడిహెట్టి ప్రాజెక్టు అనుమతులు, అంతర్రాష్ట్ర జలాల అంశాలు చర్చకు వచ్చే అవకాశముంది.

ముంబై పర్యటన అనంతరం ముఖ్యమంత్రి రేపు దేశ రాజధాని ఢిల్లీకి వెళ్లనున్నారు. ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వ పెద్దలతో సమావేశమై రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన పలు కీలక అంశాలపై చర్చించనున్నారు. ముఖ్యంగా హైదరాబాద్ మెట్రో విస్తరణ ప్రాజెక్టుకు అవసరమైన నిధులు, పెండింగ్‌లో ఉన్న కేంద్ర అనుమతులు, రాష్ట్రానికి రావాల్సిన ఆర్థిక సహాయంపై కేంద్రాన్ని కోరనున్నట్లు తెలుస్తోంది.

అలాగే కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి, ఉన్నతాధికారులతో సమావేశమై తెలంగాణకు సంబంధించిన వివిధ అభివృద్ధి ప్రాజెక్టులకు నిధుల కేటాయింపు, పెండింగ్ ప్రతిపాదనల ఆమోదంపై చర్చించే అవకాశం ఉందని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి.

రాష్ట్ర అభివృద్ధి, మౌలిక వసతుల విస్తరణ, పెట్టుబడుల ఆకర్షణ లక్ష్యంగా ముఖ్యమంత్రి చేపడుతున్న ఈ పర్యటనలకు రాజకీయ, పరిపాలనా వర్గాల్లో ప్రాధాన్యం నెలకొంది.

Spread the love

Related News

Latest News