రైతులకు రుణాలివ్వడంలో జాప్యం వద్దు

  • మొండి బకాయిల వసూళ్లకు ప్రత్యేక కార్యాచరణ చేపట్టాలి
  • ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ

ప్రతిపక్షం, మానకొండూర్, అక్టోబర్ 11: ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ఆర్థిక బలోపేతానికి మొండి బకాయిల వసూళ్లపై ప్రత్యేక దృష్టి సారించాలని మానకొండూర్‌ ఎమ్మెల్యే, టీపీసీసీ ఎస్సీ సెల్‌ చైర్మన్‌ డాక్టర్‌ కవ్వంపల్లి సత్యనారాయణ సూచించారు. రైతులకు పంట రుణాలు మంజూరు చేసే విషయంలో అనవసర ఇబ్బందులు పెట్టవద్దని, రుణాల మంజూరులో జాప్యం జరగకుండా చూడాలని స్పష్టం చేశారు. తిమ్మాపూర్‌ మండలం పోరండ్ల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (పీఏసీఎస్‌) నూతన చైర్మన్‌గా గోపు తిరుపతిరెడ్డి, పాలకవర్గ సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఆదివారం ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సహకార సంఘాల అభివృద్ధి, రైతులకు మెరుగైన సేవలు అందించడం నూతన పాలకవర్గం ప్రధాన లక్ష్యంగా పెట్టుకోవాలని అన్నారు. సంఘాలపై ఉన్న పాత బకాయిలను వసూలు చేసేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని, బకాయిల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించకుండా ఆర్థిక క్రమశిక్షణ పాటించాలని సూచించారు.

సహకార సంఘాలు రైతులకు అండగా నిలుస్తూ వ్యవసాయ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించాలని కవ్వంపల్లి అన్నారు. రైతులకు అవసరమైన సమయంలో రుణాలు అందితే సాగు పనులకు వెసులుబాటు కలుగుతుందని పేర్కొన్నారు. రుణాల మంజూరులో నిబంధనల పేరుతో రైతులను ఇబ్బందులకు గురిచేయకుండా, సాధ్యమైనంతవరకు ప్రక్రియను సరళతరం చేయాలని సూచించారు.ప్రస్తుతం లాభాల్లో కొనసాగుతున్న పోరండ్ల పీఏసీఎస్‌ను మరింత అభివృద్ధి చేసి ఆదర్శ సహకార సంఘంగా తీర్చిదిద్దాలని నూతన చైర్మన్‌, పాలకవర్గ సభ్యులకు సూచించారు. ముఖ్యంగా కూరగాయల సాగు చేసే రైతులను ప్రోత్సహించి, వారికి అవసరమైన సహకారం అందించడం ద్వారా ఆదాయం పెరిగేలా కృషి చేయాలని అన్నారు. రైతుల అవసరాలను గుర్తించి, వారి సంక్షేమానికి ప్రాధాన్యమిస్తూ సంఘం కార్యకలాపాలను ముందుకు తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో నోడల్‌ అధికారి అక్బరుద్దీన్‌, స్థానిక సర్పంచ్‌ అసోద శ్రీనివాస్‌, కరీంనగర్‌ వ్యవసాయ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ ఆకుల నర్సయ్య, పీఏసీఎస్‌ చైర్మన్లు మోరపల్లి రమణారెడ్డి, ఒగ్గు దామోదర్‌, ముద్దసాని శ్రీనివాస్‌రెడ్డి, తిమ్మాపూర్‌ మండల కాంగ్రెస్‌ అధ్యక్షుడు బండారి రమేష్‌, కాంగ్రెస్‌ నాయకులు గోపు మల్లారెడ్డి, చింతల తిరుపతిరెడ్డి, లక్ష్మారెడ్డి, తుమ్మనపల్లి శ్రీనివాసరావు, ఉంటా రాజేందర్‌రెడ్డి, ద్యావ శ్రీనివాస్‌రెడ్డి, పులి కృష్ణ, లింగాల శ్రీనివాస్‌, రేమిడి శ్రీనివాస్‌రెడ్డి, గంకిడి లక్ష్మారెడ్డి, రావుల కృష్ణగౌడ్‌, అయితం వెంకన్న, పొన్నాల సంపత్‌, కేతిరెడ్డి లింగారెడ్డి, మేడి అంజయ్య, పోలు రాము, రమేష్‌ తదితరులు పాల్గొన్నారు.

Spread the love

Related News

Latest News