వాట్సాప్‌లో సరికొత్త ‘జాప్స్’ ఫీచర్.. చూసిన వెంటనే ఫొటోలు, వీడియోలు మాయం!

ప్రతిపక్షం, నవంబర్ 16: ప్రముఖ మెసేజింగ్‌ యాప్‌ వాట్సాప్‌ తన వినియోగదారుల కోసం మరో కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చేందుకు సిద్ధమవుతోంది. ‘జాప్స్‌’ పేరుతో రూపొందిస్తున్న ఈ ఫీచర్‌ ద్వారా యాప్‌లో నుంచే ఫొటోలు, చిన్న వీడియోలను ఇతరులకు పంపించుకునే అవకాశం కలగనుంది. ఇందుకోసం ప్రత్యేకమైన కెమెరా ఇంటర్‌ఫేస్‌ను అందుబాటులోకి తీసుకురావాలని వాట్సాప్‌ యోచిస్తోంది. ఈ ఫీచర్‌లో పంపిన ఫొటోలు, వీడియోలను అవతలి వ్యక్తి ఒకసారి చూసిన వెంటనే అవి వారి చాట్‌ నుంచి తొలగిపోవడం ప్రత్యేకతగా ఉండనుంది. ప్రస్తుతం అభివృద్ధి దశలో ఉన్న ఈ సదుపాయం త్వరలో వినియోగదారులకు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.

సాధారణంగా వాట్సాప్‌లో ఫొటోలు, వీడియోలను పంపించాలంటే ఫోన్‌ కెమెరాతో కొత్తగా చిత్రీకరించడం లేదా గ్యాలరీలో ఇప్పటికే ఉన్న వాటిని ఎంపిక చేసుకోవడం ద్వారా పంపించవచ్చు. అయితే ‘జాప్స్‌’ ఫీచర్‌ ఇందుకు భిన్నంగా ఉండనుంది. ఈ సదుపాయం ద్వారా పంపించాలనుకునే ఫొటో లేదా వీడియోను ప్రత్యేక కెమెరా ఇంటర్‌ఫేస్‌ ఉపయోగించి అప్పటికప్పుడే చిత్రీకరించాల్సి ఉంటుంది. ఫోన్‌ గ్యాలరీలో ఇప్పటికే భద్రపరిచిన ఫొటోలు, వీడియోలను ఈ ఫీచర్‌ ద్వారా పంపించడానికి వీలుండదు. అంటే, ఆ సమయంలో తీసిన చిత్రాలు, చిన్న వీడియోలను మాత్రమే ఇతరులతో పంచుకునే అవకాశం కల్పించనుంది.

ఈ ఫీచర్‌లో మరో ముఖ్యమైన ప్రత్యేకత ఏమిటంటే.. రిసీవర్‌ పంపిన ఫొటో లేదా వీడియోను ఒకసారి చూసిన తర్వాత అది వారి చాట్‌ నుంచి ఆటోమేటిక్‌గా తొలగిపోతుంది. దీంతో చూసిన తర్వాత ఆ కంటెంట్‌ మళ్లీ చాట్‌లో అందుబాటులో ఉండదు. అయితే పంపిన వ్యక్తికి మాత్రం చాట్‌ హిస్టరీలో ఆ ఫొటోలు, వీడియోలను చూసుకునే అవకాశం ఉంటుందని సమాచారం. ఈ విధానం ద్వారా తాత్కాలికంగా మాత్రమే పంచుకోవాల్సిన కంటెంట్‌ను సులభంగా పంపించుకోవచ్చని భావిస్తున్నారు.

వ్యక్తిగత క్షణాలు, అప్పటికప్పుడు తీసిన ఫొటోలు, చిన్న వీడియోలను ఇతరులతో పంచుకునే విషయంలో ఈ ఫీచర్‌ ఉపయోగపడనుంది. ముఖ్యంగా ఒకసారి మాత్రమే చూడాల్సిన కంటెంట్‌ను పంపించాలనుకునే వారికి ఇది మరో ప్రత్యామ్నాయంగా మారవచ్చు. ఇప్పటికే వాట్సాప్‌లో ఉన్న వ్యూ వన్స్‌ తరహా సదుపాయానికి భిన్నమైన ప్రత్యేక అనుభూతిని అందించడమే ‘జాప్స్‌’ లక్ష్యంగా కనిపిస్తోంది. ప్రత్యేక కెమెరా ద్వారా నేరుగా కంటెంట్‌ను సృష్టించి పంపించే విధానం వినియోగదారులకు కొత్త అనుభవాన్ని ఇవ్వనుంది.

అయితే ఈ ఫీచర్‌ ప్రస్తుతం అభివృద్ధి దశలోనే ఉంది. అందువల్ల అందరికీ ఎప్పటి నుంచి అందుబాటులోకి వస్తుంది, ఏయే ఫోన్లలో తొలుత ప్రవేశపెడతారు, పూర్తి స్థాయి వినియోగ విధానం ఎలా ఉంటుంది అనే వివరాలు ఇంకా వెల్లడికావాల్సి ఉంది. అధికారికంగా అందుబాటులోకి వచ్చిన తర్వాతే ఫీచర్‌కు సంబంధించిన పూర్తి వివరాలు స్పష్టమవుతాయి. మొత్తంగా వాట్సాప్‌ తీసుకురానున్న ‘జాప్స్‌’ ఫీచర్‌ ఫొటోలు, చిన్న వీడియోలను తాత్కాలికంగా పంచుకోవాలనుకునే వారికి ఆసక్తికరమైన కొత్త సదుపాయంగా మారే అవకాశం ఉంది.

Related News

Latest News