[t4b-ticker]

స్కూల్ స్టాఫ్‌కూ బ్రేక్‌ఫాస్ట్, మధ్యాహ్న భోజనం.. ఉత్తర్వులు జారీ

ప్రతిపక్షం, జూలై 31, హైదరాబాద్: తెలంగాణలో ప్రభుత్వ పాఠశాలల్లో అమలు చేస్తున్న బ్రేక్‌ఫాస్ట్, మధ్యాహ్న భోజన పథకాన్ని విద్యార్థులతో పాటు పాఠశాల సిబ్బందికీ వర్తింపజేస్తూ రాష్ట్ర ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ఇకపై పాఠశాలల్లో పనిచేసే టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బందికి కూడా విద్యార్థులతో పాటు ఉదయం అల్పాహారం, మధ్యాహ్న భోజనం అందించనున్నారు.

ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ అన్ని జిల్లాల ప్రాంతీయ సంయుక్త సంచాలకులు, జిల్లా విద్యాశాఖ అధికారులు, మండల విద్యాశాఖ అధికారులు, ప్రధానోపాధ్యాయులకు ఆదేశాలు జారీ చేసింది. పాఠశాలల్లో విద్యార్థులకు అందిస్తున్న భోజన కార్యక్రమాన్ని సిబ్బందికి కూడా సక్రమంగా అమలు చేయాలని స్పష్టం చేసింది.

అదేవిధంగా ప్రతి పాఠశాలలో పనిచేస్తున్న టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బంది వివరాలను సంబంధిత పోర్టల్‌లో నమోదు చేయాలని విద్యాశాఖ సూచించింది. సిబ్బంది సంఖ్య ఆధారంగా అవసరమైన ఆహారాన్ని అందించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించింది.

ఇప్పటికే ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు పోషకాహారం అందించేందుకు బ్రేక్‌ఫాస్ట్, మధ్యాహ్న భోజన కార్యక్రమాలను ప్రభుత్వం అమలు చేస్తోంది. తాజాగా సిబ్బందికీ ఈ సౌకర్యాన్ని విస్తరించడంతో ఉపాధ్యాయులు, ఇతర పాఠశాల సిబ్బందికి ప్రయోజనం కలగనుంది.

ప్రభుత్వ ఉత్తర్వులను అన్ని పాఠశాలల్లో తప్పనిసరిగా అమలు చేయాలని, ఆహార పంపిణీలో నాణ్యతా ప్రమాణాలను పాటించాలని అధికారులు సూచించారు. ఈ కార్యక్రమం అమలును జిల్లా, మండల స్థాయి అధికారులు పర్యవేక్షించాలని విద్యాశాఖ ఆదేశించింది.

Spread the love

Related News

Latest News