ప్రతిపక్షం, జూన్ 16: తెలంగాణ ప్రభుత్వం రైతు భరోసా పథకంపై మరో కీలక నిర్ణయం తీసుకునే దిశగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే రెండు విడతలుగా నిధులు విడుదల చేసిన ప్రభుత్వం, మూడో విడత రైతు భరోసాతో పాటు 5 ఎకరాలకుపైగా భూమి కలిగిన రైతులకు కూడా పథకం వర్తింపజేయడంపై కసరత్తు చేస్తున్నట్లు సమాచారం.
ఈ నెల 18న జరగనున్న రాష్ట్ర కేబినెట్ సమావేశంలో దీనిపై తుది నిర్ణయం తీసుకునే అవకాశముందని తెలుస్తోంది. రైతు భరోసాతో పాటు సన్న వరిధాన్యానికి బోనస్ చెల్లింపు, ఉపసర్పంచుల చెక్‌పవర్ రద్దు, తుమ్మిడిహెట్టి ప్రాజెక్టు, హైదరాబాద్ మెట్రో ఫేజ్-2 విస్తరణ, గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల నిర్వహణ వంటి కీలక అంశాలు కూడా కేబినెట్ అజెండాలో ఉన్నట్లు సమాచారం.
రైతు భరోసా విస్తరణపై ప్రభుత్వం తీసుకునే నిర్ణయం రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది మంది రైతులకు ప్రయోజనం చేకూర్చే అవకాశం ఉందని భావిస్తున్నారు.

















