హైదరాబాద్, ప్రతిపక్షం బ్యూరో: లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన గిరిజన సంక్షేమ శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ జగజ్యోతి వ్యవహారంలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. హైదరాబాద్‌లోని ఆమె నివాసంలో సోదాలు జరిపిన ఏసీబీ అధికారులు పెద్ద ఎత్తున నగదు, బంగారం స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ఆమెను అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరచగా న్యాయస్థానం 14 రోజుల రిమాండ్ విధించింది. ఆమె ఇంట్లో సుమారు రూ.64 లక్షలు స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. రెండున్నర కిలోల బంగారం కూడా తనిఖీల్లో పట్టుబడినట్లు చెప్పారు. అనంతరం ఆమెను చంచల్ కూడా జైలుకు తరలించారు. ఈ క్రమంలో ఆమె అస్వస్థతకు గురి కావడంతో ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. వైద్యులు పలు పరీక్షలు నిర్వహించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు వైద్యులు చెప్పినట్లు ఏసీబీ అధికారులు తెలిపారు. జ్యోతి భారీగా అక్రమాలకు పాల్పడినట్లు ఏసీబీ భావిస్తోంది.
ఈ నేపథ్యంలో మరింత లోతుగా కేసును విచారించాలని యోచిస్తోంది. నిజామాబాద్ జిల్లాలోని అభివృద్ధి పనులకు బిల్లులు మంజూరు చేసేందుకు గాజుల రామారంలోని బాలల సంరక్షణ గృహనిర్మాణ పనులు అప్పగించేందుకు కాంట్రాక్టర్ బోడుకం గంగాధర్ వద్ద గిరిజన సంక్షేమశాఖ ఈఈ జగజ్యోతి డబ్బులు డిమాండ్ చేసింది. ఈ విషయాన్ని బాధితుడు అవినీతి నిరోధక శాఖ అధికారులను ఆశ్రయించాడు. దీనిపై అధికారులు స్పందించారు. పథకం ప్రకారమే సోమవారం రోజున కార్యాలయానికి వెళ్లిన గంగాధర్ రూ.84 వేలు లంచం ఇచ్చాడు. ఆ సమయంలోనే అధికారులు ఆమెను పట్టుకున్నారు.
ఒక్కొక్కటిగా అవినీతి అధికారుల బాగోతాలు..
రాష్ట్రంలో ఇటీవల ప్రభుత్వ అవినీతి అధికారుల బాగోతాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పటికే ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అరెస్టైన హెచ్ఎండీఏ మాజీ డైరెక్ట్ శివబాలకృష్ణను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేసి విచారణ కొనసాగిస్తున్నారు. నిందితుడుతో పాటు అతని సోదరుడు, మరో ఇద్దరి బినామీలను ఈ కేసులో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు బెయిల్ పిటిషన్ వేయగా ఏసీబీ కోర్టు తిరస్కరించింది. ఈ కేసులో ఓ ఐఏఎస్ అధికారి కూడా ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. శివబాలకృష్ణకు సంబంధించి భూములు, ఆస్తులు భారీగా ఉన్నాయని అధికారులు గుర్తించారు.
లంచం తీసుకుంటూ చిక్కిన శామీర్‌పేట ఎమ్మార్వో..
మరోవైపు మల్కాజ్‌గిరి జిల్లాలోని శామీర్‌పేట తహశీల్దార్ తోడేటి సత్యనారాయణ రూ.10 లక్షలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. మరో అధికారి నల్గొండ జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ లచ్చునాయక్ రూ.3 లక్షలు లంచం పుచ్చుకుంటూ ఏసీబీకి చిక్కాడు. ఈ అవినీతి ప్రభుత్వ అధికారులందరూ గత వారంలోపై అధికారులకు చిక్కారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది. ప్రస్తుతం లంచం తీసుకుంటూ పట్టుబడిన అధికారులందర్ని ఏసీబీ విచారిస్తుంది. వారి నుంచి సంచలన విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని ఏసీబీ అధికారులు భావిస్తోన్నారు.