Trending Now

ఆ నియోజకవర్గాల్లో కాంగ్రెస్‎కు క్లిష్టంగా మారిన ఆభ్యర్థుల ఎంపిక

హైదరాబాద్​, ప్రతిపక్షం స్టేట్​బ్యూరో: పార్లమెంట్ ఎన్నికల కోసం చేరికలను ప్రొత్సహించిన కాంగ్రెస్ పార్టీ.. ఇప్పుడు ఆ వలస నేతల్లో ఎవరికి సీటు ఇవ్వాలనే దానిపై ఎటూ తేల్చుకోలేకపోతోంది. ఇక భువనగిరి ఎంపీ సీటు విషయంలో సీఎం రేవంత్ వర్సెస్ కోమటిరెడ్డి బ్రదర్స్ అన్నట్టుగా పరిస్థితి ఉందనే చర్చ జరుగుతోంది. అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ క్లిష్టంగా మారడంతో.. ఫ్లాష్ సర్వేతో క్యాండిడేట్లను ఎంపిక చేయాలని హైకమాండ్ భావిస్తోంది.

తెలంగాణలోని పలు స్థానాల్లో అభ్యర్థుల ఎంపిక కాంగ్రెస్ పార్టీకి సంక్లిష్టంగా మారింది. అభ్యర్థుల ఎంపికపై ఢిల్లీలో సమావేశమైన పార్టీ ఎలక్షన్ కమిటీ.. ఈ అంశంలో ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని తెలుస్తోంది. పలు స్థానాల్లో పోటీ కోసం అభ్యర్థుల మధ్య పోటీ ఎక్కువగా ఉండటమే ఇందుకు అసలు కారణంగా కనిపిస్తోంది. మల్కాజ్‌గిరి, సికింద్రాబాద్, భువనగిరి స్థానాలు ఈ జాబితాలో ఉన్నట్టు టాక్. అత్యంత కీలకమైనది, గతంలో సీఎం రేవంత్ రెడ్డి ప్రాతినిథ్యం వహించిన మల్కాజ్‌గిరి సీటు కోసం సునీతా మహేందర్ రెడ్డి, కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి మధ్య పోటీ నెలకొంది. సునీతా మహేందర్ రెడ్డి చేవేళ్ల నుంచి పోటీ చేస్తారని అనుకున్నా.. బీఆర్ఎస్ ఎంపీ రంజిత్ రెడ్డి కాంగ్రెస్ గూటికి రావడంతో ఆమెను మల్కాజ్‌గిరి నుంచి బరిలోకి దింపే ఆలోచన చేస్తోంది హస్తం పార్టీ.

అయితే ఈ సీటు కోసం బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి వచ్చిన కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి కూడా గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నారు. దీంతో మల్కాజ్‌గిరి సీటుపై పీఠముడి వీడటం లేదు. సికింద్రాబాద్ సీటు కోసం కూడా కాంగ్రెస్‌లో పోటీ ఉంది. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి వచ్చిన జీహెచ్‌ఎంసీ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్.. ఈ సీటును ఆశిస్తున్నారు. అయితే ఇటీవల హస్తం గూటికి చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌ను ఇక్కడి నుంచి ఎంపీగా బరిలోకి దింపాలనే ఆలోచన కూడా కాంగ్రెస్ నేతల మదిలో ఉంది. దీంతో సికింద్రాబాద్ సీటు వీరిలో ఎవరికి దక్కుతుందనే అంశంపై ఉత్కంఠ నెలకొంది.

ఇక భువనగిరి ఎంపీ సీటు కోసం కోమటిరెడ్డి బ్రదర్స్ వర్సెస్ సీఎం రేవంత్ అన్నట్టుగా పోటీ సాగుతున్నట్టు తెలుస్తోంది. భువనగిరి నుంచి మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి భార్య లక్ష్మిని బరిలోకి దింపాలని కోమటిరెడ్డి బ్రదర్స్ భావిస్తున్నారు. అయితే ఈ సీటు కోసం సీఎం రేవంత్‌ సన్నిహితుడైన చామల కిరణ్ కుమార్ రెడ్డి గట్టిగా పోటీపడుతున్నారు. భువనగిరి నుంచి గతంలో కోమటిరెడ్డి బ్రదర్స్ ఇద్దరూ ఎంపీలుగా గెలిచారు. ఇక్కడి వారికి గట్టి పట్టుంది. దీంతో వాళ్లని కాదని మరో వ్యక్తిని సీటు ఇచ్చే పరిస్థితి లేదు. అయితే చామల కిరణ్ కుమార్ రెడ్డికి సీటు ఇప్పించేందుకు సీఎం రేవంత్ గట్టిగా ప్రయత్నాలు చేస్తున్నారని తెలుస్తోంది. మల్కాజ్‌గిరి, సికింద్రాబాద్, భువనగిరి సీట్లలో పోటీ ఎక్కువగా ఉండటంతో.. ఫ్లాష్ సర్వే నిర్వహించి ఇక్కడ అభ్యర్థులను ఎంపిక చేయాలని కాంగ్రెస్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. అయితే మల్కాజ్‌గిరి, సికింద్రాబాద్ సీట్ల విషయంలో సీఎం రేవంత్ మాట నెగ్గినా.. భువనగిరి సీటు విషయంలో కోమటిరెడ్డి బ్రదర్స్‌ను ఒప్పించకుండా నిర్ణయం తీసుకుంటారా అన్నది ఆసక్తికరంగా మారింది.

Spread the love