ప్రతిపక్షం, వెబ్‌డెస్క్: రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గం కొత్తూరు మండల పరిధిలోని కోడిచర్ల తండవాసులు ఓటు వేయడానికి నిరాకరించారు. తమ తండాకు పోలింగ్ బూత్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ.. రోడ్డు పై ధర్నాకు దిగారు. గతంలో కూడా అధికారులకు ఎన్నోసార్లు ఫిర్యాదు చేసిన ఎలాంటి స్పందన రాలేదని కోడిచర్ల ఉమ్మడి గ్రామపంచాయతీ నుండి నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న తమ కోడిచర్ల తండా ప్రత్యేక గ్రామపంచాయతీగా ఏర్పడిన పోలింగ్ బూతుని ఏర్పాటు చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి గ్రామ పంచాయతీ పోలింగ్ బూత్ కు వెళ్లడానికి దూరం ఉన్నందున వృద్ధులకు, వికలాంగులకు ఇబ్బందికరంగా ఉందిని.. తమకు కనీసం బస్సు సౌకర్యం కూడా లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఓటు వేసే ప్రసక్తి లేదని కోడిచర్ల తాండ గ్రామపంచాయతీ ప్రజలు, మహిళలు, యువత రోడ్డుపై ధర్నాకు దిగి నిరసన తెలిపారు. విషయం తెలుసుకున్న ఎన్నికల అధికారులు, పోలీసులు తండాకు చేరుకొని ఈసారి ఓటింగ్ లో పాల్గొనాలని వచ్చే ఎన్నికల్లో పోలింగ్ బూత్ ఏర్పాటు చేస్తామని హామీ ఇవ్వడంతో ధర్నాను విరమించి ఓటింగ్ లో తాండ ప్రజలు పాల్గొన్నారు.