పాలమూరు ప్రాజెక్టుల పూర్తి లక్ష్యం 2027.. 26 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తాం: సీఎం రేవంత్ రెడ్డి

ప్రతిపక్షం, జూన్ 06: ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో కొనసాగుతున్న సాగు, తాగునీటి ప్రాజెక్టుల పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసి జిల్లాను సస్యశ్యామలం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. జిల్లాలోని ప్రధాన నీటిపారుదల ప్రాజెక్టులను క్షేత్రస్థాయిలో పరిశీలించిన అనంతరం కొత్తూరు కరివెన రిజర్వాయర్ వద్ద నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన ఈ మేరకు ప్రకటించారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో 26 లక్షల ఎకరాలకు సాగునీరు అందించేందుకు ప్రభుత్వం పూర్తి చిత్తశుద్ధితో పనిచేస్తోందని తెలిపారు.

గత రెండు రోజులుగా పాలమూరు ప్రాంతంలోని ప్రధాన సాగునీటి ప్రాజెక్టులను మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరితో కలిసి పరిశీలించిన ముఖ్యమంత్రి, గత ప్రభుత్వ హయాంలో ప్రాజెక్టుల అమలులో జరిగిన లోపాలను ప్రస్తావించారు. పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకం వంటి కీలక ప్రాజెక్టులు పూర్తి నిర్లక్ష్యానికి గురయ్యాయని ఆరోపించారు. పాలమూరు, కల్వకుర్తి, భీమా, నెట్టెంపాడు, జూరాల, కోయిల్ సాగర్ వంటి ప్రాజెక్టులు సమయానికి పూర్తయ్యి ఉంటే జిల్లాలోని లక్షల ఎకరాలకు సాగునీరు అందేదని పేర్కొన్నారు.

ప్రాజెక్టుల నిర్మాణానికి అత్యంత కీలకమైన భూసేకరణను పూర్తి చేయకుండా గతంలో పంపులు, లిఫ్ట్‌ల కొనుగోళ్లకే భారీగా నిధులు ఖర్చు చేశారని సీఎం విమర్శించారు. సాగునీటి ప్రాజెక్టుల పేరుతో గత ప్రభుత్వం రూ.84 వేల కోట్లకు పైగా అప్పులు చేసినప్పటికీ, తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అసలు, వడ్డీ కలిపి రూ.52 వేల కోట్లకు పైగా చెల్లించిందని వెల్లడించారు. అదే సమయంలో కొత్త ప్రాజెక్టుల కోసం రూ.22 వేల కోట్లు ఖర్చు చేయగా, అందులో రూ.8 వేల కోట్లు పాలమూరు ప్రాంత ప్రాజెక్టులకే వెచ్చించినట్లు తెలిపారు.

రాబోయే రెండేళ్లలో పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులన్నింటినీ పూర్తి చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని సీఎం చెప్పారు. ఇందుకోసం దశలవారీ ప్రణాళిక రూపొందిస్తున్నామని, క్షేత్రస్థాయిలో ఉన్న సమస్యలను గుర్తించి పరిష్కరిస్తామని వెల్లడించారు. ప్రస్తుతం జిల్లాలోని పలు ప్రాజెక్టులకు సంబంధించి మరో నాలుగు వేల ఎకరాల భూసేకరణ అవసరమని పేర్కొంటూ, రైతులకు న్యాయమైన పరిహారం చెల్లించి భూసేకరణను వేగవంతం చేస్తామని తెలిపారు.

“ఇప్పుడైనా ఈ పనులు పూర్తి చేయకపోతే చరిత్ర క్షమించదు” అని వ్యాఖ్యానించిన ముఖ్యమంత్రి, ప్రాజెక్టులతో పాటు రిజర్వాయర్ల నిర్మాణం కూడా సమాంతరంగా పూర్తవ్వాల్సిన అవసరం ఉందన్నారు. నిలిచిపోయిన రిజర్వాయర్ పనులను పునరుద్ధరించి, భవిష్యత్తులో నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు.

కర్ణాటక సరిహద్దు ప్రాంతంలో బ్రిడ్జ్ కమ్ బ్యారేజీ నిర్మాణ ప్రతిపాదనపై కూడా సీఎం స్పందించారు. భూగర్భ జలాల పెరుగుదలకు ఇది ఉపయోగపడుతుందన్న నిపుణుల అభిప్రాయాలను పరిశీలించి, సాంకేతిక నిపుణులతో చర్చలు జరిపి కర్ణాటక ప్రభుత్వంతో సమన్వయం చేసుకుంటామని వెల్లడించారు.

పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి సంబంధించి ఉన్న అడ్డంకులను ఒక్కొక్కటిగా తొలగిస్తూ 2027 నాటికి పంపులు, లిఫ్ట్‌లు, కాలువల నిర్మాణాన్ని పూర్తి చేయాలనే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నామని సీఎం తెలిపారు. ఉద్దండాపూర్ వరకు నీటిని తరలించే పనులను ప్రాధాన్యంగా చేపడతామని, తదుపరి దశలపై మరోసారి సమీక్ష నిర్వహిస్తామని చెప్పారు.

పాలమూరు ప్రాజెక్టుల విషయంలో తమ ప్రభుత్వ చిత్తశుద్ధిని ఎవరూ శంకించాల్సిన అవసరం లేదని పేర్కొన్న సీఎం, తాను కూడా ఈ ప్రాంతానికి చెందిన వ్యక్తినేనని గుర్తుచేశారు. జిల్లాను అభివృద్ధి చేయడం తన బాధ్యతగా భావిస్తున్నానని, ఎలాంటి స్వార్థ ప్రయోజనాలకు తావులేకుండా పనిచేస్తానని స్పష్టం చేశారు.

వ్యవసాయ రంగానికి సంబంధించిన అంశాలపై మాట్లాడిన ముఖ్యమంత్రి, రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం 75 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేస్తోందని తెలిపారు. రైతులకు అవసరమైన యూరియా సరఫరాలో కేంద్ర ప్రభుత్వం సహకరించాలని కోరారు. రామగుండం ఎరువుల కర్మాగారంలో ఉత్పత్తి అవుతున్న యూరియాను రాష్ట్ర అవసరాలకు ప్రాధాన్యంగా కేటాయించాలని డిమాండ్ చేశారు.

నీటి హక్కుల విషయంలో తెలంగాణ ఎలాంటి రాజీ పడదని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. గోదావరి జలాల్లో రాష్ట్రానికి కేటాయించిన 968 టీఎంసీల నికర జలాలపై పూర్తి హక్కు సాధిస్తామని, ఒక్క చుక్క నీటినీ వదులుకునే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. కృష్ణా జలాల సమస్యల పరిష్కారానికి కూడా ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఈ ఏడాది డిసెంబర్ నాటికి పెండింగ్ అంశాలన్నింటినీ పరిష్కరించే దిశగా కృషి చేస్తామని వెల్లడించారు.

పక్క రాష్ట్రాలతో వివాదాల కంటే పరిష్కారాలకే తమ ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తుందని పేర్కొన్న సీఎం, తెలంగాణ నీటి హక్కుల పరిరక్షణలో మాత్రం ఎలాంటి రాజీ ఉండదని మరోసారి స్పష్టం చేశారు. ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టు అమలుకు సంబంధించి మహారాష్ట్ర ప్రభుత్వంతో చర్చలు కొనసాగుతున్నాయని, ఇప్పటికే ఆ రాష్ట్ర ముఖ్యమంత్రికి లేఖ రాసినట్లు వెల్లడించారు.

Spread the love

Related News

Latest News