ప్రతిపక్షం, జూలై 22: కరీంనగర్ నగరంలో అర్ధరాత్రి దొంగలు రెచ్చిపోయారు. భగత్‌నగర్ ప్రాంతంలోని ఓ వృద్ధ దంపతుల ఇంటిని లక్ష్యంగా చేసుకుని దుండగులు భారీ దోపిడీకి పాల్పడ్డారు. డమ్మీ తుపాకులు, కత్తులతో ఇంట్లోకి చొరబడిన ఎనిమిది మంది దుండగులు కుటుంబ సభ్యులను బెదిరించి బంగారం, నగదు దోచుకెళ్లిన ఘటన స్థానికంగా కలకలం రేపింది.
పోలీసుల వివరాల ప్రకారం, అజ్మత్ అలీ (81) నివాసంలోకి అర్ధరాత్రి ప్రవేశించిన దుండగులు ఆయనతో పాటు కుటుంబ సభ్యులపై దాడి చేశారు. అనంతరం ఇంట్లో ఉన్న సుమారు 70 తులాల బంగారం, రూ.21 లక్షల నగదును అపహరించి అక్కడి నుంచి పరారయ్యారు.
దోపిడీ అనంతరం నిందితులు బైకులపై వెళ్లిపోతున్న దృశ్యాలు సమీపంలోని సీసీ కెమెరాల్లో నమోదయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు, క్లూస్ టీమ్ ఘటనాస్థలికి చేరుకుని ఆధారాలను సేకరించారు. సీసీటీవీ ఫుటేజీతో పాటు ఇతర సాంకేతిక ఆధారాల ఆధారంగా నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
నగరంలో సంచలనం సృష్టించిన ఈ ఘటనపై పోలీసులు ప్రత్యేక దర్యాప్తు ప్రారంభించగా, దోపిడీకి పాల్పడిన ముఠాను త్వరలోనే పట్టుకుంటామని అధికారులు తెలిపారు.

















