వేళాపాళా లేకుండా విద్యుత్ కోత విధిస్తున్నారని ఆగ్రహం
24 గంటల నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయాలని ధర్నాలు..
రోడ్లపైకి వచ్చిన రైతులు
ప్రతిపక్షం ప్రతినిధి, సిద్ధిపేట,సెప్టెంబర్ 12: సిద్ధిపేట జిల్లాలో విద్యుత్ కోతలపై రైతుల ఆగ్రహం వ్యక్తమైంది. పంటలకు అవసరమైన సమయంలో విద్యుత్ సరఫరా కావడం లేదని ఆరోపిస్తూ శనివారం జిల్లాలోని పలు మండలాల్లో రైతులు రోడ్లపైకి వచ్చి ధర్నాలు, నిరసనలు నిర్వహించారు. వ్యవసాయానికి 24 గంటల నాణ్యమైన విద్యుత్ అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
జక్కాపూర్‌లో రోడ్డుపై ధర్నా
నారాయణరావుపేట మండలం జక్కాపూర్ గ్రామంలో రైతులు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం సరఫరా చేస్తున్న విద్యుత్ సరిపోవడం లేదని ఆరోపించారు. కనీసం ఆరు నుంచి ఏడు గంటలు కూడా నిరంతరాయంగా విద్యుత్ అందడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. విద్యుత్ కోతల కారణంగా పంట పొలాలు ఎండిపోయే పరిస్థితి ఏర్పడిందని తెలిపారు. తక్షణమే 24 గంటల విద్యుత్ సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. రైతుల ఆందోళనకు బీఆర్ఎస్ నాయకులు మద్దతు తెలిపారు.
లక్ష్మీదేవిపల్లి పరిసర గ్రామాల రైతుల నిరసన
నారాయణరావుపేట మండలం లక్ష్మీదేవిపల్లి గ్రామంలోనూ రైతులు రోడ్డుపై ధర్నా చేపట్టారు. లక్ష్మీదేవిపల్లి, ఇబ్రహీంపూర్, బంజేరు పల్లి, కోదండరావుపల్లి గ్రామాలకు చెందిన రైతులు ఆందోళనలో పాల్గొన్నారు. పంటలు సాగు చేసిన సమయంలో విద్యుత్ కోతలు విధించడంతో సాగునీరు అందక పంటలు దెబ్బతింటున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. నాణ్యమైన విద్యుత్‌ను నిరంతరాయంగా సరఫరా చేయాలని కోరారు.
మల్లారం వద్ద రాజీవ్ రహదారిపై రాస్తారోకో
చిన్నకోడూరు మండలం మల్లారం గ్రామం వద్ద రాజీవ్ రహదారిపై సికింద్లపూర్, మల్లారం గ్రామాలకు చెందిన రైతులు రాస్తారోకో నిర్వహించారు. ఉదయం ఎనిమిది గంటలకు ప్రారంభమైన ఈ నిరసనలో వ్యవసాయానికి 24 గంటల విద్యుత్ సరఫరా చేయాలని రైతులు డిమాండ్ చేశారు. విద్యుత్ కోతలతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ధర్నాలో జిల్లా రైతుబంధు డైరెక్టర్ మేడికాయల వెంకటేశం, సర్పంచ్ హరీశ్, మాజీ సర్పంచ్ జయవర్ధన్ రెడ్డి, ఉప సర్పంచ్‌లు, వార్డు సభ్యులు, ఆయా గ్రామాల రైతులు పాల్గొని రైతులకు మద్దతు తెలిపారు.
కొండంరాజుపల్లి సబ్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత
నంగునూరు మండలం కొండంరాజుపల్లి సబ్‌స్టేషన్ ఎదుట బీఆర్ఎస్ నాయకులు రైతులతో కలిసి ధర్నా నిర్వహించారు. విద్యుత్ కోతలను నిరసిస్తూ నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. సమస్యలపై విద్యుత్ శాఖ ఏఈకి వినతిపత్రం అందించేందుకు నాయకులు, రైతులు సుమారు 40 నిమిషాల పాటు వేచి చూశారు. ఏఈ మారుతి అక్కడికి రాకపోవడంతో నాయకులు, రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సబ్ స్టేషన్ ఆపరేటర్ నరేశ్ ను కొంతసేపు గదిలో నిర్బంధించారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. అనంతరం లైన్ ఇనస్పెక్టర్ రాములు అక్కడికి చేరుకోవడంతో ఆయనకు నాయకులు, రైతులు వినతిపత్రం అందజేశారు. రైతుల సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించాలని కోరారు.
రాజగోపాలపేటలోనూ రైతుల నిరసన
సిద్దిపేట జిల్లాలోని నంగునూరు మండలం రాజగోపాలపేట గ్రామంలో రైతులు సబ్ స్టేషన్ వద్ద నిరసన వ్యక్తం చేశారు. విద్యుత్ కోతల కారణంగా పంట పొలాలు ఎండిపోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజా పాలనలో రైతులు కరెంటు కోతలతో నానా ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు.
వ్యవసాయానికి నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయాలని డిమాండ్ చేస్తూ విద్యుత్ శాఖ ఏఈకి రైతులు వినతిపత్రం అందజేశారు.
ఒకే డిమాండ్.. 24 గంటల విద్యుత్
జిల్లాలోని పలు ప్రాంతాల్లో జరిగిన రైతుల ఆందోళనల్లో ప్రధానంగా ఒకే డిమాండ్ వినిపించింది. వ్యవసాయానికి 24 గంటల నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయాలి.. విద్యుత్ కోతలను వెంటనే నిలిపివేయాలి.. పంటలు ఎండిపోకుండా చర్యలు తీసుకోవాలి అని రైతులు ప్రభుత్వాన్ని కోరారు. విద్యుత్ సరఫరా సక్రమంగా లేకపోతే సాగునీరు అందక పెట్టుబడులు నష్టపోయే ప్రమాదం ఉందని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం, విద్యుత్ శాఖ అధికారులు స్పందించి వ్యవసాయానికి నిరంతరాయంగా విద్యుత్ అందించాలని రైతులు విజ్ఞప్తి చేశారు.

































