ప్రతిపక్షం స్టేట్ బ్యూరో, హైదరాబాద్, సెప్టెంబర్ 12: హాస్పిటల్ నిర్వహణ, రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించడంలో ఎదురయ్యే సవాళ్లు, చికిత్సలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై లోహిత్సాయి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఛైర్మన్, ప్రొఫెసర్ డాక్టర్ భాస్కర్ అమరిశెట్టి ప్రత్యేక ఉపన్యాసం ఇచ్చారు.
హైదరాబాద్లోని ఇంజినీరింగ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియాలో జరుగుతున్న తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ సర్జన్స్ ఆఫ్ ఇండియా (TGASICON) 2026 12వ వార్షిక సదస్సులో డాక్టర్ భాస్కర్ “Hospital Management and Patient Treatment” అంశంపై ప్రసంగించారు.
ఈ సందర్భంగా గ్రామీణ ప్రాంతాల్లో ఆసుపత్రుల నిర్వహణ, అత్యవసర పరిస్థితుల్లో రోగులకు సకాలంలో చికిత్స అందించడం, శస్త్రచికిత్స అనంతర సమస్యలను సమర్థంగా నిర్వహించడం, వైద్య సిబ్బందికి నిరంతర శిక్షణ ఇవ్వడం, రోగులు–బంధువులు–సిబ్బంది మధ్య సమన్వయం వంటి అంశాలను ఆయన వివరించారు.
అదేవిధంగా ఆసుపత్రి నిర్వహణలో వైద్య నైపుణ్యంతో పాటు స్టాఫ్ మేనేజ్మెంట్, పేషెంట్ కమ్యూనికేషన్, నాణ్యమైన వైద్య సేవలు, రోగి భద్రత వంటి అంశాలు కూడా ఎంతో కీలకమని డాక్టర్ భాస్కర్ పేర్కొన్నారు.
కార్యక్రమంలో మెదక్ సర్జన్స్ అసోసియేషన్ మరియు ASI ప్రముఖులు డాక్టర్ జగదీశ్ గౌడ్, డాక్టర్ సురేష్ చంద్ర హరి, డాక్టర్ వికాస్, డాక్టర్ లింగం అలిశాల, డాక్టర్ పోకాల సురేష్, డాక్టర్ కిరణ్, డాక్టర్ రామకృష్ణ, డాక్టర్ నర్సింహారెడ్డి, డాక్టర్ గణేష్ శంకర్, డాక్టర్ నరేష్, డాక్టర్ ఇలయ్య తదితరులు పాల్గొన్నారు.
వైద్య రంగంలో విశేష సేవలందిస్తూ, ఆసుపత్రి నిర్వహణతో పాటు యువ సర్జన్లకు మార్గదర్శకంగా నిలుస్తున్న డాక్టర్ భాస్కర్ అమరిశెట్టి TGASICON వేదికపై చేసిన ప్రసంగానికి పలువురు వైద్యులు అభినందనలు తెలిపారు.

































