[t4b-ticker]

544 పోస్టుల నోటిఫికేషన్ రద్దు.. కొత్తగా ఉద్యోగ ప్రకటనకు టీజీపీఎస్సీ సిద్ధం

ప్రతిపక్షం, సెప్టెంబర్ 12: తెలంగాణ ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో ఖాళీగా ఉన్న 544 పోస్టుల భర్తీకి సంబంధించి కీలక పరిణామం చోటుచేసుకుంది. 2022లో జారీ చేసిన సంక్షిప్త ఉద్యోగ ప్రకటనను తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ రద్దు చేసింది. సుదీర్ఘంగా చర్చించిన అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నట్లు కమిషన్ వెల్లడించింది.

డిగ్రీ కళాశాలల్లో డిగ్రీ అధ్యాపకులు, శారీరక విద్యా సంచాలకులు, గ్రంథపాలకుల పోస్టుల భర్తీ కోసం 2022లో 544 ఖాళీలతో సంక్షిప్త నోటిఫికేషన్ జారీ చేశారు. అయితే వివిధ కారణాలతో ఆ నియామక ప్రక్రియ ముందుకు సాగలేదు. తాజాగా పాత ప్రకటనను రద్దు చేసినట్లు కమిషన్ స్పష్టం చేసింది.

పాత నోటిఫికేషన్‌ ఆధారంగా ఉద్యోగ నియామకాలను ఆశిస్తున్న అభ్యర్థులు ఈ విషయాన్ని గమనించాలని టీజీపీఎస్సీ సూచించింది. 2022లో ప్రకటించిన 544 పోస్టుల ప్రకటన ఇకపై అమల్లో ఉండదని, ఆ ప్రకటన ఆధారంగా నియామక ప్రక్రియ కొనసాగదని స్పష్టం చేసింది.

మరోవైపు కొత్త రోస్టర్ విధానం, ప్రస్తుతం అమల్లో ఉన్న నిబంధనలకు అనుగుణంగా పోస్టులను పునఃపరిశీలించి కొత్త ఉద్యోగ ప్రకటన జారీ చేసేందుకు అధికారులు సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఈ వారంలోనే కొత్త నోటిఫికేషన్‌ విడుదల చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.

కొత్త నోటిఫికేషన్‌లో పోస్టుల సంఖ్య, కేటగిరీల వారీగా ఖాళీలు, రోస్టర్‌ విధానం, అర్హతలు, వయోపరిమితి, దరఖాస్తు విధానం తదితర వివరాలను స్పష్టంగా వెల్లడించే అవకాశం ఉంది. దీంతో పాత నోటిఫికేషన్ కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులు కొత్త ప్రకటన వెలువడే వరకు వేచి చూడాల్సి ఉంటుంది.

ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో అధ్యాపకులు, శారీరక విద్యా సిబ్బంది, గ్రంథపాలకుల ఖాళీల భర్తీ ద్వారా విద్యా బోధన, ఇతర విద్యా సేవలను బలోపేతం చేసే అవకాశం ఉంది. కొత్త రోస్టర్‌, నిబంధనల ప్రకారం నియామక ప్రక్రియను తాజాగా ప్రారంభించేందుకు టీజీపీఎస్సీ చర్యలు చేపడుతున్నట్లు తెలుస్తోంది.

Spread the love

Related News

Latest News