విద్యను వ్యాపారంగా మార్చారు.. విద్యార్థుల భవిష్యత్తుతో కేంద్రం ఆడుకుంటోంది: మహేష్ కుమార్ గౌడ్

ప్రతిపక్షం, జూలై 15: కేంద్ర ప్రభుత్వం విద్యను వ్యాపారంగా మార్చి విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడుతోందని టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ ఆరోపించారు. హైదరాబాద్ బోయినపల్లిలో నిర్వహించిన “ఛత్రోంకి గూంజ్” కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు.

ఈ సందర్భంగా మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ.. ఉద్యోగ, విద్యా పోటీ పరీక్షల్లో వరుసగా జరుగుతున్న ప్రశ్నాపత్రాల లీకేజీలతో లక్షలాది మంది విద్యార్థులు, నిరుద్యోగ యువత భవిష్యత్తు ప్రమాదంలో పడిందన్నారు. ముఖ్యంగా నీట్ సహా జాతీయ స్థాయి పరీక్షల్లో చోటుచేసుకున్న పేపర్ లీకేజీలు దేశ విద్యా వ్యవస్థపై విద్యార్థులు, తల్లిదండ్రుల విశ్వాసాన్ని దెబ్బతీశాయని విమర్శించారు.

విద్యా వ్యవస్థలో చోటుచేసుకున్న వైఫల్యాలకు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఇన్ని ఆరోపణలు, ఆధారాలు వెలుగులోకి వచ్చినా కేంద్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం బాధాకరమని అన్నారు.

లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ దేశవ్యాప్తంగా చేపట్టిన “ఛత్రోంకి గూంజ్” కార్యక్రమం విద్యార్థుల హక్కుల పరిరక్షణ కోసం జరుగుతున్న ఉద్యమమని పేర్కొన్నారు. పరీక్షల నిర్వహణలో పూర్తి పారదర్శకత, జవాబుదారీతనం ఉండే విధంగా కేంద్ర ప్రభుత్వం వ్యవస్థను బలోపేతం చేయాలని కోరారు.

దేశ విద్యా వ్యవస్థను కాపాడేందుకు, విద్యార్థుల భవిష్యత్తును రక్షించేందుకు యువత, విద్యార్థులు పెద్ద ఎత్తున ఈ ఉద్యమానికి మద్దతు ఇవ్వాలని మహేష్ కుమార్ గౌడ్ పిలుపునిచ్చారు.

Spread the love

Related News

Latest News