ప్రతిపక్షం, జూలై 11: తెలంగాణలో డూప్లికేట్ ఓటర్లపై ఎన్నికల సంఘం కఠిన చర్యలకు సిద్ధమైంది. ఒకే వ్యక్తి రెండు వేర్వేరు నియోజకవర్గాల్లో లేదా రెండు రాష్ట్రాల్లో ఓటరుగా నమోదు కావడం చట్టవిరుద్ధమని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) సుదర్శన్ రెడ్డి స్పష్టం చేశారు.
ఉద్దేశపూర్వకంగా రెండు చోట్ల ఓటు నమోదు చేసుకున్నట్లు తేలితే సంబంధిత వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అలాంటి వారికి గరిష్ఠంగా ఏడాది జైలు శిక్షతో పాటు జరిమానా కూడా విధించే అవకాశం ఉందని తెలిపారు.
డూప్లికేట్ ఓటర్లను గుర్తించేందుకు ఎన్నికల సంఘం డెమోగ్రాఫికల్లీ సిమిలర్ ఎంట్రీస్ (DSE) సాఫ్ట్వేర్ను వినియోగిస్తోందని సుదర్శన్ రెడ్డి వెల్లడించారు. ఈ సాంకేతిక విధానం ద్వారా ఒకే వ్యక్తి పేరుతో ఉన్న బహుళ ఓటరు నమోదులను సులభంగా గుర్తిస్తున్నామని చెప్పారు.
ఇప్పటికే డూప్లికేట్ ఓట్లకు సంబంధించిన పలు కేసుల్లో కొందరికి నోటీసులు జారీ చేసినట్లు ఆయన తెలిపారు. ఓటరు జాబితాను పూర్తిగా పారదర్శకంగా, తప్పులులేకుండా రూపొందించడమే ఎన్నికల సంఘం లక్ష్యమని పేర్కొన్నారు.
అర్హులైన ప్రతి ఒక్కరూ ఒక్కచోట మాత్రమే ఓటరుగా నమోదు కావాలని, అనవసరంగా రెండోసారి ఓటు నమోదు చేసుకోవద్దని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ప్రజలకు సూచించారు.
















