రామాలయ విరాళాల చోరీపై ప్రియాంక ఆగ్రహం.. నిష్పక్షపాత విచారణకు డిమాండ్

ప్రతిపక్షం, జూన్ 27: అయోధ్య శ్రీరామాలయంలో విరాళాల చోరీ ఘటనపై కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. శ్రీరాముడి సన్నిధిలో చోరీ జరగడం అత్యంత ఘోరమైన పాపమని, ఈ ఘటన కోట్లాది మంది భక్తుల విశ్వాసాన్ని దెబ్బతీసిందని అన్నారు. దేశవ్యాప్తంగా ఈ పరిణామం తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని పేర్కొన్నారు.

సీసీటీవీ కెమెరాలను ట్యాంపర్ చేయడం, వేల కోట్ల రూపాయల నిధుల దుర్వినియోగం వంటి ఘటనలు కేవలం చిన్నస్థాయి ఉద్యోగుల వల్ల జరిగే అవకాశం లేదని ప్రియాంక గాంధీ వ్యాఖ్యానించారు. ఈ వ్యవహారం వెనుక పెద్దస్థాయి వ్యక్తులు ఉండే అవకాశాన్ని కూడా తోసిపుచ్చలేమని అన్నారు.

ఈ కేసును పూర్తి పారదర్శకంగా, నిష్పక్షపాతంగా విచారించి అసలు బాధ్యులను గుర్తించాలని, ఎవరైనా ఎంతటి స్థాయిలో ఉన్నా చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. భక్తుల విశ్వాసాన్ని కాపాడేందుకు ప్రభుత్వం వెంటనే సమగ్ర విచారణ చేపట్టి నిజాలను వెలుగులోకి తీసుకురావాలని ప్రియాంక గాంధీ కోరారు.

Spread the love

Related News

Latest News