ప్రతిపక్షం, ఆగస్టు 14: తెలంగాణలో ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియను సైబర్ నేరగాళ్లు తమకు అనుకూలంగా ఉపయోగించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఎన్నికల సంఘం పేరుతో నకిలీ ఫోన్ కాల్స్, సందేశాలు, వాట్సాప్ లింకులు పంపుతూ ఓటర్ల వ్యక్తిగత, బ్యాంకింగ్ వివరాలను దోచుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలో ఓటర్లు అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ ముఖ్య ఎన్నికల అధికారి సూచించారు.
‘మీ ఓటర్ వివరాలు సరిగ్గా లేవు’, ‘ఎస్‌ఐఆర్ దరఖాస్తు తిరస్కరణకు గురైంది’, ‘వెంటనే వివరాలను సవరించుకోండి’ అంటూ కొందరు సైబర్ నేరగాళ్లు సందేశాలు పంపుతున్నట్లు అధికారులు తెలిపారు. సమస్యను పరిష్కరించుకోవాలంటే ప్రత్యేక నంబర్‌కు ఫోన్ చేయాలని లేదా సందేశంలో ఇచ్చిన లింక్‌పై క్లిక్ చేయాలని సూచిస్తున్నారని చెప్పారు. ఓటర్లు ఆందోళనకు గురై స్పందించిన వెంటనే అసలు మోసానికి తెరతీస్తున్నారని హెచ్చరించారు.
కొన్ని సందర్భాల్లో కేవలం రూ.5 చెల్లించాలని కోరుతూ లింకులు పంపుతున్నట్లు అధికారులు గుర్తించారు. ఆ మొత్తాన్ని చెల్లించే సమయంలో నెట్ బ్యాంకింగ్ వివరాలు, డెబిట్ లేదా క్రెడిట్ కార్డు నంబర్, సీవీవీ, పాస్‌వర్డ్, ఏటీఎం పిన్ వంటి రహస్య సమాచారాన్ని నమోదు చేయించే ప్రయత్నం చేస్తున్నారు. చిన్న మొత్తాన్ని చెల్లించాలనే పేరుతో కీలకమైన బ్యాంకింగ్ సమాచారాన్ని కాజేయడం సైబర్ నేరగాళ్ల ప్రధాన వ్యూహంగా మారిందని అధికారులు హెచ్చరిస్తున్నారు.
అంతేకాకుండా అధికారిక ఎన్నికల సంఘం వెబ్‌సైట్‌ను పోలిన నకిలీ వెబ్‌సైట్లను కూడా రూపొందించే అవకాశం ఉందని తెలిపారు. లింక్‌పై క్లిక్ చేసిన వెంటనే తెరుచుకునే ఇలాంటి వెబ్‌సైట్లలో ఓటర్ ఐడీ, మొబైల్ నంబర్, వ్యక్తిగత వివరాలు, బ్యాంకు ఖాతా సమాచారం తదితరాలను నమోదు చేయాలని కోరవచ్చు. ఈ వివరాలు సైబర్ నేరగాళ్ల చేతికి చిక్కితే ఆర్థిక మోసాలకు పాల్పడే ప్రమాదం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు.
ముఖ్యంగా ఓటర్లు ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలని అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఎన్నికల అధికారులు ఫోన్, వాట్సాప్ లేదా సందేశాల ద్వారా ఏటీఎం పిన్, సీవీవీ, నెట్ బ్యాంకింగ్ పాస్‌వర్డ్ వంటి రహస్య బ్యాంకింగ్ వివరాలను అడగరు. ఎవరైనా అధికారుల పేరుతో ఇలాంటి సమాచారం కోరితే వెంటనే అప్రమత్తం కావాలని సూచిస్తున్నారు.
అదేవిధంగా ‘వెంటనే స్పందించాలి’, ‘లేకపోతే మీ ఓటు రద్దవుతుంది’, ‘మీ దరఖాస్తు తిరస్కరించబడుతుంది’ అంటూ ఒత్తిడి చేసే సందేశాలను నమ్మవద్దని సూచించారు. అత్యవసర పరిస్థితి ఉన్నట్లు భయపెట్టి ఓటర్లను తమ మాట వినేలా చేయడం సైబర్ నేరగాళ్ల సాధారణ పద్ధతి అని అధికారులు తెలిపారు.
ఎస్‌ఐఆర్‌కు సంబంధించిన ఏదైనా సమాచారం కావాలంటే అధికారిక ఎన్నికల సంఘం వేదికలను మాత్రమే ఉపయోగించాలని సూచించారు. అనుమానాస్పద సందేశాలు వస్తే వాటికి సమాధానం ఇవ్వకూడదని, అందులోని ఫోన్ నంబర్లకు కాల్ చేయకూడదని, ఎలాంటి లింకులపైనా క్లిక్ చేయకూడదని హెచ్చరించారు. అలాగే ఇలాంటి సందేశాలను ఇతరులకు పంపకుండా వెంటనే తొలగించాలని సూచించారు.
మరోవైపు ఓటర్లు తమ పేరు ఓటర్ల జాబితాలో ఉందో లేదో అధికారిక మార్గాల్లో స్వయంగా నిర్ధారించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ఓటు హక్కుకు సంబంధించిన సమస్యలను పరిష్కరించుకునే క్రమంలో వ్యక్తిగత లేదా బ్యాంకింగ్ వివరాలను ఎవరితోనూ పంచుకోవద్దని స్పష్టం చేశారు.
ప్రస్తుతం ఎస్‌ఐఆర్ ప్రక్రియపై రాష్ట్రంలో విస్తృతంగా చర్చ జరుగుతున్న నేపథ్యంలో సైబర్ నేరగాళ్లు ఇదే అంశాన్ని మోసాలకు అనుకూలంగా మార్చుకునే అవకాశం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఎస్‌ఐఆర్ పేరుతో వచ్చే అనుమానాస్పద సందేశాలను నమ్మొద్దు.. లింకులు తెరవొద్దు.. డబ్బులు చెల్లించొద్దు.. బ్యాంకింగ్ వివరాలు చెప్పొద్దు అని ఓటర్లకు స్పష్టమైన సూచనలు చేశారు.





























