ప్రతిపక్షం, జూలై 25: సంతానోత్పత్తి సమస్యలు కేవలం మహిళల్లోనే కాకుండా పురుషుల్లో కూడా వయసు పెరిగే కొద్దీ పెరుగుతాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. సాధారణంగా మహిళల్లో వయసు పెరిగే కొద్దీ అండాల సంఖ్య, వాటి నాణ్యత తగ్గినట్లే, పురుషుల్లో కూడా ముఖ్యంగా 40 ఏళ్ల తర్వాత స్పెర్మ్ నాణ్యత క్రమంగా తగ్గుతుందని వివరిస్తున్నారు.
నిపుణుల ప్రకారం, వయసు పెరిగేకొద్దీ స్పెర్మ్‌లోని DNA దెబ్బతినే (DNA Fragmentation) అవకాశం ఎక్కువవుతుంది. దీంతో స్పెర్మ్ నాణ్యత తగ్గడమే కాకుండా, అండం ఫలదీకరణ ప్రక్రియ కూడా ప్రభావితమవుతుంది. ఫలితంగా గర్భం ధరించడంలో ఆలస్యం కావడం, గర్భస్రావం, గర్భధారణ సమయంలో సంక్లిష్టతలు వంటి సమస్యలు తలెత్తే ప్రమాదం పెరుగుతుంది.
ఆరోగ్యకరమైన జీవనశైలి, సమతుల ఆహారం, క్రమం తప్పకుండా వ్యాయామం, ధూమపానం–మద్యపానానికి దూరంగా ఉండటం, తగినంత నిద్ర, ఒత్తిడిని నియంత్రించడం ద్వారా సంతానోత్పత్తి ఆరోగ్యాన్ని మెరుగుపర్చుకోవచ్చని వైద్యులు సూచిస్తున్నారు.
అయితే, గర్భధారణలో ఇబ్బందులు ఎదురైతే స్వయంగా నిర్ణయాలు తీసుకోవడం కంటే ఫర్టిలిటీ నిపుణులను సంప్రదించి అవసరమైన పరీక్షలు చేయించుకోవడం ఉత్తమమని నిపుణులు సూచిస్తున్నారు.

















