[t4b-ticker]

పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి.. ప్రియురాలిని హత్య చేసి గోనెసంచిలో కట్టిన ప్రియుడు

ప్రతిపక్షం, ఆగస్టు 17, హైదరాబాద్: పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేసిన ప్రియురాలిని ఓ యువకుడు దారుణంగా హత్య చేసిన ఘటన బాలాపూర్‌లో తీవ్ర కలకలం రేపింది. ప్రియురాలిని కత్తితో పొడిచి హతమార్చిన అనంతరం మృతదేహాన్ని గోనెసంచిలో కట్టి బెడ్‌రూమ్‌లో ఉంచి నిందితుడు పరారైనట్లు పోలీసులు తెలిపారు.

పోలీసుల వివరాల ప్రకారం.. బాలాపూర్ పరిధిలోని బిస్మిల్లా కాలనీలో రెహానా, మహ్మద్ సలామ్ అనే ఇద్దరు నివాసం ఉంటున్నారు. వీరిద్దరూ కొంతకాలంగా ప్రేమలో ఉన్నట్లు సమాచారం. ఇటీవల తనను వివాహం చేసుకోవాలని రెహానా సలామ్‌పై ఒత్తిడి తీసుకొచ్చినట్లు తెలుస్తోంది. ఈ విషయంలో ఇద్దరి మధ్య తరచూ గొడవలు జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

ఈ క్రమంలోనే సలామ్ తీవ్ర ఆగ్రహానికి గురై రెహానాపై కత్తితో దాడి చేసినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలింది. కత్తిపోట్లకు గురైన ఆమె అక్కడికక్కడే మృతి చెందినట్లు పోలీసులు భావిస్తున్నారు. అనంతరం మృతదేహాన్ని గోనెసంచిలో కట్టి బెడ్‌రూమ్‌లో ఉంచి అక్కడి నుంచి నిందితుడు పరారైనట్లు తెలిపారు.

ఉదయాన్నే ఈ ఘటన వెలుగులోకి రావడంతో బిస్మిల్లా కాలనీ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఘటనకు సంబంధించిన ఆధారాలను సేకరిస్తున్నారు.

మృతురాలు రెహానా, నిందితుడు మహ్మద్ సలామ్ ఇద్దరూ బిహార్‌కు చెందినవారిగా పోలీసులు గుర్తించారు. హత్యకు దారితీసిన పూర్తి కారణాలు, వీరి మధ్య జరిగిన వివాదానికి సంబంధించిన వివరాలను తెలుసుకునేందుకు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పరారీలో ఉన్న సలామ్ కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు చేపట్టినట్లు సమాచారం.

ప్రేమ వ్యవహారం చివరకు హత్యకు దారితీయడంతో స్థానికంగా తీవ్ర ఆందోళన నెలకొంది. నిందితుడు పట్టుబడితే హత్యకు సంబంధించిన పూర్తి వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని పోలీసులు తెలిపారు.

Spread the love

Related News

Latest News