విద్యార్థుల భవిష్యత్తు కోసం బోధిస్తున్న వారికి నో ఛాన్స్
ఉత్తమ టీచర్ల ఎంపికలో సంఘాల సిఫారసులే చెల్లుబాటు
అసలైన ప్రతిభావంతులకు అన్యాయం జరుగుతోందని విద్యావేత్తల ఆవేదన
అధికారులపై టీచర్ల సంఘాల ఒత్తిడి.. ప్రేక్షక పాత్రలోనే విద్యాశాఖ
జిల్లాల్లో 52 మంది ఎంపిక.. మెరిట్‌పై మాత్రం తీవ్ర విమర్శలు
పైరవీ ఉంటే అవార్డు.. పనితీరు ఉంటే పక్కనపెట్టడమే
జిల్లా విద్యాశాఖ తీరుపై తీవ్ర విమర్శలు
ప్రతిపక్షం ప్రతినిధి మెదక్ సెప్టెంబర్ 05: ఉపాధ్యాయుడు అంటే కేవలం పాఠాలు చెప్పే వ్యక్తి కాదు. విద్యార్థి భవిష్యత్తుకు బాటలు వేసే మార్గదర్శి. ఒక విద్యార్థి జీవితాన్ని మార్చే శక్తి ఉపాధ్యాయుడి చేతిలో ఉంటుంది. అలాంటి ఉపాధ్యాయుల సేవలను గుర్తించి ప్రభుత్వం అందించే ఉత్తమ ఉపాధ్యాయుల అవార్డుకు ఎంతో ప్రతిష్ఠ ఉంది.కానీ అదే ప్రతిష్ఠాత్మక అవార్డుల ఎంపిక ప్రక్రియపై ఇప్పుడు అనేక విమర్శలు తలెత్తుతున్నాయి. నిజంగా విద్యార్థులకు అంకితభావంతో బోధిస్తున్న వారికే అవార్డులు దక్కుతున్నాయా? లేక పలుకుబడి, పైరవీ, సంఘాల సిఫారసులు కూడా ఎంపికలో ప్రభావం చూపుతున్నాయా? అనే చర్చ ఉపాధ్యాయ వర్గాల్లో, విద్యావేత్తల్లో జరుగుతోంది.
మెదక్ జిల్లా వ్యాప్తంగా 52 మంది ఉత్తమ ఉపాధ్యాయుల ఎంపిక జరిగిన నేపథ్యంలో ఎంపికైన వారి పనితీరు, అర్హతలు, ఎంపికకు అనుసరించిన ప్రమాణాలు, సిఫారసుల పాత్రపై పారదర్శకత కోరుతున్నారు.ఉత్తమ ఎవరు? పైరవీ ఉన్నవారా.. విద్యార్థులను తీర్చిదిద్దినవారా?ఉత్తమ ఉపాధ్యాయుడంటే విద్యార్థుల హాజరు పెంచినవాడు కావచ్చు. చదువులో వెనుకబడిన పిల్లలను ముందుకు తీసుకొచ్చినవాడు కావచ్చు. పాఠశాల ఫలితాలను మెరుగుపరిచినవాడు కావచ్చు. కొత్త బోధనా పద్ధతులు ప్రవేశ పెట్టినవాడు కావచ్చు.అయితే అవార్డు ఎంపికలో అసలు కొలమానం ఏమిటన్నదే ఇప్పుడు ప్రధాన ప్రశ్న.ఎంపికైన టీచర్ నిజంగా ఎంతమంది విద్యార్థుల జీవితాలను ప్రభావితం చేశారు?పాఠశాల ఫలితాలు ఎలా ఉన్నాయి?బోధనలో కొత్త పద్ధతులు అమలు చేశారా?వెనుకబడిన విద్యార్థుల కోసం ప్రత్యేకంగా ఏం చేశారు?ఈ ప్రశ్నలకు సమాధానాలు ఆధారంగా కాకుండా సిఫారసుల ఆధారంగా ఎంపిక జరిగితే.. అవార్డు ఉద్దేశమే దెబ్బతింటుందని విద్యావేత్తలు అభిప్రాయపడుతున్నారు.
టీచర్స్ సంఘాల సిఫారసులే కీలకమయ్యాయి
ఉపాధ్యాయ సంఘాలు ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి పనిచేయడం సహజం. అయితే అవార్డుల ఎంపికలో సంఘాల సిఫారసులు ఎంతవరకు ప్రభావం చూపుతున్నాయి? అన్నదే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. కొంతమంది ఉపాధ్యాయుల పేర్లను సంఘాలు ముందుకు తీసుకువచ్చారని అధికారుల వద్ద సిఫారసులు చేశారని ఆ తర్వాత అదే పేర్లు తుది జాబితాలో కనిపించాయనే ఆరోపణలువినిపిస్తున్నాయి.ఇది నిజమైతే.. ఒక ప్రశ్న తప్పనిసరిగాతలెత్తుతుంది.మెరిట్ ఆధారంగా ఎంపిక జరుగుతోందా?లేక ఎవరికి ఎవరి పరిచయం ఉందన్నది కూడా ప్రమాణంగా మారింది
విద్యార్థుల ఫలితాలకు విలువ లేదు
ఉత్తమ ఉపాధ్యాయుడి పనితీరుకు విద్యార్థుల విద్యా ఫలితాలు ఒక ముఖ్యమైన సూచిక. అయితే ఫలితాలే ఒక్కటే ప్రమాణం కాకపోయినా.. వాటిని పూర్తిగా పక్కన పెట్టడం కూడా సమంజసం కాదని విద్యావేత్తలు చెబుతున్నారు.
ఒక ఉపాధ్యాయుడు పనిచేస్తున్న పాఠశాలలో గత మూడేళ్లలో విద్యార్థుల ఫలితాలు ఎలా ఉన్నాయి?పాఠశాల హాజరు పెరిగిందా?డ్రాప్‌అవుట్ తగ్గిందా?వెనుకబడిన విద్యార్థుల స్థాయి మెరుగుపడిందా?వీటిపై డేటా తీసుకుని మార్కులు కేటాయించారా?లేదంటే కేవలం దరఖాస్తు, సిఫారసు, దృవపత్రాల ఆధారంగానే నిర్ణయం తీసుకున్నారా?క్షేత్రస్థాయి పరిశీలన జరిగిందా?ఉత్తమ ఉపాధ్యాయుడిని ఎంపిక చేయాలంటే కార్యాలయంలో కూర్చొని ఫైళ్లు పరిశీలించడం సరిపోదని పలువురు విద్యావేత్తలు అంటున్నారు.పాఠశాలకు వెళ్లి తరగతి గదిలో బోధనను పరిశీలించారా?
విద్యార్థులతో మాట్లాడారా?తల్లిదండ్రుల అభిప్రాయాలు తీసుకున్నారా?సహచర ఉపాధ్యాయుల అభిప్రాయాలు తెలుసుకున్నారా?పాఠశాల హెచ్ఎం ల నివేదికను పరిశీలించారా?అవార్డు కోసం దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్కరి వాస్తవ పనితీరును క్షేత్రస్థాయిలో పరిశీలిస్తేనే నిజమైన ప్రతిభ బయటపడుతుందని వారు సూచిస్తున్నారు.
52 మంది ఎంపిక.. పారదర్శకత ఎక్కడ
మెదక్ జిల్లా వ్యాప్తంగా 52 మంది ఉపాధ్యాయులను ఉత్తములుగా ఎంపిక చేసిన నేపథ్యంలో ఎంపిక ప్రక్రియపై పూర్తి వివరాలు బహిర్గతం చేయాలని డిమాండ్ వినిపిస్తోంది.ఎంపికకు మొత్తం ఎన్ని దరఖాస్తులు వచ్చాయి?ఎన్ని దరఖాస్తులు తిరస్కరించారు?ప్రతి అభ్యర్థికి ఎన్ని మార్కులు వచ్చాయి?ఎంపిక కమిటీలో ఎవరు ఉన్నారు?ఏ ప్రమాణాలకు ఎన్ని మార్కులు కేటాయించారు?చివరి జాబితా ఎలా రూపొందింది?ఈ వివరాలు అందుబాటులో ఉంటే అవార్డుల ఎంపికపై అనుమానాలకు చాలా వరకు తెరపడే అవకాశం ఉంది.ఎంపికైన వారిలో సుమారు 80 శాతం మందికి అవార్డు అర్హతపై సందేహాలున్నాయంటూ కొన్ని వర్గాల నుంచి విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
అయితే ఇది అధికారికంగా నిర్ధారించాల్సిన అంశం. అందుకే ప్రతి ఎంపికైన ఉపాధ్యాయుడి పనితీరు వివరాలను బహిరంగపరచాల్సిన అవసరం ఉంది.ఎవరైనా అర్హతలేని వ్యక్తి ఎంపికైతే.. అతని పేరు వెనుక ఉన్న సిఫారసు ఏమిటన్నదీ ప్రశ్నించాల్సి ఉంటుంది.అదే సమయంలో అర్హత కలిగిన వ్యక్తిపై ఆరోపణలు చేయకుండా.. రికార్డులు, పనితీరు, మార్కుల ఆధారంగా మాత్రమే నిర్ణయం తీసుకోవాలి.
అసలైన టీచర్లకు అన్యాయం ఎలా జరుగుతోంది
గ్రామీణ పాఠశాలల్లో పనిచేసే అనేక మంది ఉపాధ్యాయులు తమ పనిని ప్రచారం చేసుకోరు.పాఠశాలలో ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉండి విద్యార్థులకు బోధిస్తారు.చదువులో వెనుకబడిన పిల్లలకు అదనపు సమయం కేటాయిస్తారు.పేద కుటుంబాల పిల్లలకు పుస్తకాలు, విద్యా సామగ్రి అందించేందుకు సహకరిస్తారు.పాఠశాల అభివృద్ధికి గ్రామస్థులతో కలిసి పనిచేస్తారు.కానీ ఇలాంటి ఉపాధ్యాయులకు సంఘాల స్థాయిలో బలమైన సిఫారసులు లేకపోతే గుర్తింపు దక్కడం కష్టమవుతోందన్న ఆవేదన వ్యక్తమవుతోంది.ఒకసారి అవార్డు కోసం పైరవీ పనిచేస్తుందన్న నమ్మకం ఉపాధ్యాయుల్లో ఏర్పడితే దాని ప్రభావం చాలా దూరం వెళ్తుంది.బాగా పనిచేస్తే అవార్డు వస్తుందనే సానుకూల సందేశం బదులు పలుకుబడి ఉంటే అవార్డు వస్తుందనే భావన ఏర్పడే ప్రమాదం ఉంది.ఇది కేవలం ఒక అవార్డు సమస్య కాదు.ఇది వేలాది టీచర్ల పని తీరుపై ప్రభావం చూపే అంశం.
విద్యా శాఖ అధికారుల పాత్రపై తీవ్ర విమర్శలు
ఉత్తమ ఉపాధ్యాయుల ఎంపికలో విద్యాశాఖ అధికారులదే కీలక బాధ్యత.టీచర్స్ సంఘాలే. ఆ నాయకుల సిఫారసులు చేసినా.. తుది నిర్ణయం అధికారులు నిబంధనలు, మెరిట్ ఆధారంగా తీసుకోవాల్సి ఉంటుంది.అయితే సంఘాల ఒత్తిళ్లకు అధికారులు లోబడుతున్నారనే ఆరోపణలు నిజమైతే అది మరింత తీవ్రమైన విషయం. అధికారులు స్వతంత్రంగా పరిశీలించారా సిఫారసులపై మాత్రమే ఆధారపడ్డారా?ఎంపిక కమిటీ నిర్ణయాలకు ఆధారాలు ఏమిటనే విమర్శలకు సమాధానాలు అవసరముంది.సంఘాలు ఒత్తిడికి తలోగ్గి విద్యా శాఖ తీవ్ర విమర్శలు ఎదుర్కొతోంది.
‘సంఘం’ కాదు.. ‘సేవలే ప్రమాణం కావాలి
ఉత్తమ ఉపాధ్యాయుల ఎంపికలో ఏ సంఘానికి చెందినవారన్నది ప్రమాణం కాకూడదు.ఏ రాజకీయ, సంఘ, వ్యక్తిగత పరిచయాలు ఉన్నాయన్నది కూడా ప్రమాణం కాకూడదు.ఒకే ఒక్క అంశం ప్రధానంగా ఉండాలి.విద్యార్థుల కోసం ఆ ఉపాధ్యాయుడు ఏం చేశారన్నదే అసలు ప్రశ్న.మెరిట్ ఆధారిత విధానం వస్తే వివాదాలకు చెక్ ఉత్తమ ఉపాధ్యాయుల ఎంపికలో మార్కుల ఆధారిత విధానం తీసుకురావాలని విద్యావేత్తలు సూచిస్తున్నారు.





























