ప్రతిపక్షం, సెప్టెంబర్ 05: తెలంగాణలో ఉపాధ్యాయుల సమస్యలన్నింటినీ పరిష్కరించేందుకు తనకు రెండేళ్ల సమయం ఇవ్వాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోరారు. రెండేళ్లలో టీచర్ల సమస్యలను పరిష్కరించే బాధ్యత తాను తీసుకుంటానని హామీ ఇచ్చారు. కొడంగల్లో నిర్వహించిన సభలో ఉపాధ్యాయులను ఉద్దేశించి సీఎం ఈ వ్యాఖ్యలు చేశారు. ఉపాధ్యాయులు తమ సమస్యల పరిష్కారం కోసం తరచూ రోడ్లపైకి వచ్చి ధర్నాలు చేయడం వల్ల విద్యార్థుల మనసుల్లో ప్రభుత్వంపై ప్రతికూల ఆలోచనలు ఏర్పడే అవకాశం ఉందని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.
టీచర్లు రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేయకుండా ప్రభుత్వం తమ సమస్యలను పరిష్కరించేందుకు అవకాశం ఇవ్వాలని సీఎం కోరారు. ‘‘రెండేళ్లు నాకు సమయం ఇవ్వండి. మీ సమస్యలన్నీ పరిష్కరిస్తాను’’ అని స్పష్టం చేశారు. ఉపాధ్యాయుల సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు.
తనపై, ప్రభుత్వంపై తీర్పు ఇచ్చే అధికారం చివరకు ప్రజల చేతుల్లోనే ఉంటుందని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. 2028 డిసెంబర్ లేదా 2029 మార్చి, ఏప్రిల్ నెలల్లో ఎన్నికలు జరిగే సమయంలో తాను మళ్లీ ఉపాధ్యాయులు, ప్రజల వద్దకే వస్తానని అన్నారు. అప్పుడు తన ప్రభుత్వ పనితీరుకు నూటికి నూరు మార్కులు వేస్తారో, నూటికి సున్నా మార్కులు వేస్తారో అది పూర్తిగా వారి ఇష్టమని స్పష్టం చేశారు.
ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని సీఎం పేర్కొన్నారు. ఇప్పటికే ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతుల విషయంలో ప్రభుత్వం చర్యలు చేపట్టిందని గుర్తుచేశారు. విద్యా వ్యవస్థను బలోపేతం చేయడంతో పాటు టీచర్లకు ఎదురవుతున్న సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు.
విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దే బాధ్యత ఉపాధ్యాయులపై ఉందని రేవంత్ రెడ్డి అన్నారు. ఉపాధ్యాయులు ప్రశాంతమైన వాతావరణంలో విధులు నిర్వహించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, అందుకు అవసరమైన సహకారం అందిస్తామని తెలిపారు. మరోవైపు తమ సమస్యలపై ఉపాధ్యాయులు ఆందోళనలకు దిగుతున్న నేపథ్యంలో సీఎం చేసిన ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.





























