ప్రతిపక్షం, నవంబర్ 07: తెలంగాణలో నెలకొన్న నీటి కొరత నేపథ్యంలో పాఠశాలల పని దినాల విషయంలో మార్పులు చేయాలని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ మల్క కొమురయ్య రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. రాష్ట్రంలోని పాఠశాలలకు సోమవారం నుంచి శుక్రవారం వరకు మాత్రమే తరగతులు నిర్వహించి, శనివారం సెలవు ప్రకటించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. ప్రస్తుతం నీటి ఎద్దడి కారణంగా కొన్ని విద్యాసంస్థలు, హాస్టళ్లు విద్యార్థులను ఇళ్లకు పంపించిన పరిస్థితులు ఉన్నాయని ఆయన తన లేఖలో ప్రస్తావించారు. నీటి కొరత రోజురోజుకూ తీవ్రమవుతున్న నేపథ్యంలో పాఠశాలల్లో నీటి వినియోగాన్ని తగ్గించడంతో పాటు విద్యుత్‌ను కూడా ఆదా చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.
ఈ నేపథ్యంలో వారానికి ఐదు రోజుల పాటు పాఠశాలలు నిర్వహించడం ద్వారా నీరు, విద్యుత్ వినియోగాన్ని కొంతవరకు తగ్గించవచ్చని సూచించారు. అయితే శనివారం సెలవు ఇవ్వడం వల్ల విద్యార్థుల చదువుకు, నిర్ణయించిన విద్యా ప్రణాళికకు ఎలాంటి ఆటంకం కలగకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని కోరారు. ఇందుకోసం సోమవారం నుంచి శుక్రవారం వరకు ప్రతిరోజూ తరగతి సమయాన్ని 35 నుంచి 45 నిమిషాల వరకు పెంచాలని ప్రతిపాదించారు. ఇలా చేయడం ద్వారా వారానికి అవసరమైన బోధనా సమయాన్ని కొనసాగించవచ్చని పేర్కొన్నారు. నీటి సంక్షోభాన్ని దృష్టిలో ఉంచుకుని విద్యార్థులు, ఉపాధ్యాయుల ప్రయోజనాలను సమన్వయం చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని ఎమ్మెల్సీ మల్క కొమురయ్య కోరారు. అయితే ఈ ప్రతిపాదనపై రాష్ట్ర ప్రభుత్వం ఇంకా ఎలాంటి అధికారిక నిర్ణయం తీసుకోలేదు. శనివారం సెలవు ప్రతిపాదనను ప్రభుత్వం పరిశీలిస్తుందా? లేదా? అన్నది వేచి చూడాలి.





























