పట్టభద్రుల ఓటరు నమోదు ప్రక్రియను వేగవంతం చేయాలి: అడిషనల్ సీఈవో వాసం వెంకటేశ్వర్ రెడ్డి

*గ్రాడ్యుయేట్ ఓటరు నమోదులో పారదర్శకత తప్పనిసరి – నల్గొండ కలెక్టరేట్ లో ఉన్నతస్థాయి సమీక్ష.

*20 కంప్యూటర్లతో రెండు షిఫ్టుల్లో గ్రాడ్యుయేట్ ఓట్ల పరిశీలన – కలెక్టర్ చంద్రశేఖర్ .

*అర్హత పత్రాలను క్షుణ్ణంగా పరిశీలించి గడువులోగా నమోదు పూర్తి చేయాలి: అడిషనల్ సీఈవో

*నల్గొండ కలెక్టరేట్ లో ఉమ్మడి జిల్లాల ఎన్నికల అధికారులతో ఉన్నతస్థాయి సమీక్ష .

ప్రతిపక్షం – నల్గొండ, అక్టోబర్ 29: వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ ఓటరు నమోదు ప్రక్రియను వేగవంతం చేయాలని, ఎలాంటి జాప్యం లేకుండా పారదర్శకంగా పూర్తి చేయాలని రాష్ట్ర అడిషనల్ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ డాక్టర్ వాసం వెంకటేశ్వర్ రెడ్డి అధికారులను ఆదేశించారు.

గురువారం నల్గొండ కలెక్టరేట్ లోని కాన్ఫరెన్స్ హాల్ లో ఉమ్మడి నల్గొండ జిల్లాలకు చెందిన నల్గొండ, యాదాద్రి-భువనగిరి, సూర్యాపేట జిల్లాల ఎన్నికల అధికారులతో ఆయన విస్తృత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా అడిషనల్ సీఈవో మాట్లాడుతూ… పట్టభద్రుల ఓటరు నమోదు అత్యంత కీలకమైన ప్రక్రియ అని, ఇందులో ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా చూడాలని సూచించారు.

*ఆయన పలు కీలక ఆదేశాలు జారీ చేశారు:

*డూప్లికేట్ దరఖాస్తుల ఏరివేత: ఒకే వ్యక్తి రెండు, మూడు సార్లు చేసిన దరఖాస్తులను సాఫ్ట్ వేర్ ద్వారా గుర్తించి నిబంధనల ప్రకారం తిరస్కరించాలి. ఫారం-18 లో సమర్పించిన పత్రాలను క్షుణ్ణంగా పరిశీలించాలి.

*అర్హత ధ్రువపత్రాల తనిఖీ: డిగ్రీ సర్టిఫికెట్, మార్కుల జాబితా, నివాస ధ్రువపత్రం వంటి అర్హత పత్రాలు సక్రమంగా ఉన్నాయా లేదా అని నిశితంగా పరిశీలించాలి. నకిలీ పత్రాలతో దరఖాస్తు చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని హెచ్చరించారు.

*గడువులోగా పూర్తి: ఎన్నికల సంఘం నిర్ణయించిన గడువులోగా ఓటరు నమోదు, పరిశీలన, తుది జాబితా ప్రచురణ పూర్తయ్యేలా కార్యాచరణ రూపొందించుకోవాలన్నారు.

అనంతరం జిల్లా కలెక్టర్ బి.చంద్రశేఖర్ మాట్లాడుతూ… నల్గొండ జిల్లాలో పట్టభద్రుల ఓటరు నమోదు దరఖాస్తుల పరిశీలన కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశామన్నారు. కలెక్టరేట్ లో 20 కంప్యూటర్లతో రెండు షిఫ్టుల్లో ఉదయం నుండి రాత్రి వరకు సిబ్బంది దరఖాస్తుల పరిశీలన చేపడుతున్నారని తెలిపారు. ఇప్పటి వరకు వచ్చిన దరఖాస్తుల్లో అత్యధిక శాతం పరిశీలన పూర్తయ్యిందని, మిగిలినవి కూడా త్వరలో పూర్తి చేస్తామని వివరించారు.

ఈ సమావేశంలో రెవెన్యూ అదనపు కలెక్టర్ జె.శ్రీనివాస్, ట్రైనీ అసిస్టెంట్ కలెక్టర్ శ్రీకాంత్ రెడ్డి, దేవరకొండ సబ్ కలెక్టర్ కరోలిన్ చింగ్ థియాన్ మావి, నల్గొండ ఆర్డీవో, ఎన్నికల విభాగం డిప్యూటీ తహసీల్దార్లు తదితరులు పాల్గొన్నారు.

Spread the love

Related News

Latest News