[t4b-ticker]

పొన్నం సత్తయ్య జీవన సాఫల్య పురస్కారాల ప్రదానం

  • పొన్నం ప్రభాకర్ సమక్షంలో విశిష్ట వ్యక్తులకు సత్కారం
  • వ్యవసాయం, సాహిత్యం, కళల రంగాల్లో సేవలకు గుర్తింపు
  • పురస్కార గ్రహీతలకు నగదు బహుమతి, మెమెంటో అందజేత

ప్రతిపక్షం బ్యూరో, కరీంనగర్, సెప్టెంబర్ 14: పొన్నం సత్తయ్య చారిటబుల్ ట్రస్ట్, తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో శ్రీ పొన్నం సత్తయ్య గౌడ్ 16వ వర్ధంతి సందర్భంగా “పొన్నం సత్తయ్య జీవన సాఫల్య పురస్కారం–2026” కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. సమాజంలోని వివిధ రంగాల్లో విశేష సేవలు అందించిన ప్రముఖులను ఈ సందర్భంగా సత్కరించారు. వ్యవసాయ రంగంలో ఎం. కోదండరెడ్డి, సాహిత్య రంగంలో వెలిచాల కొండల్‌రావు, కళారంగంలో గొట్టే కనకవ్వలకు “పొన్నం సత్తయ్య జీవన సాఫల్య పురస్కారం–2026” ప్రదానం చేశారు.

శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు జూపల్లి కృష్ణారావు, వివేక్ వెంకటస్వామి, అడ్లూరి లక్ష్మణ్ కుమార్‌లతో కలిసి మంత్రి పొన్నం ప్రభాకర్ పురస్కారాలను అందజేశారు. పురస్కార గ్రహీతలకు మెమెంటోతో పాటు రూ.50 వేల నగదు బహుమతిని కూడా అందజేశారు. తమ తమ రంగాల్లో దీర్ఘకాలంగా అందించిన సేవలకు గుర్తింపుగా ఈ పురస్కారాలు ప్రదానం చేయడం విశేషమని నిర్వాహకులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు పొన్నం సత్తయ్య గౌడ్ సేవలను స్మరించుకున్నారు. సమాజ అభ్యున్నతి, సామాజిక చైతన్యం, ప్రజా సేవల పట్ల ఆయన చూపిన నిబద్ధత నేటి తరానికి ఆదర్శమని కొనియాడారు. ఆయన స్ఫూర్తితో సేవా కార్యక్రమాలు కొనసాగుతున్నాయని తెలిపారు.

కార్యక్రమంలో ఎమ్మెల్యేలు కవ్వంపల్లి సత్యనారాయణ, మేడిపల్లి సత్యం, ప్రొఫెసర్ హరగోపాల్, బీసీ సంక్షేమ శాఖ కార్యదర్శి బాలమయాదేవి, వివిధ కార్పొరేషన్‌ల చైర్మన్లు, ప్రజాప్రతినిధులు, సాహితీవేత్తలు, కళాకారులు పాల్గొన్నారు. పెద్ద సంఖ్యలో అభిమానులు, సామాజిక సంస్థల ప్రతినిధులు హాజరయ్యారు. పురస్కారాల ద్వారా వివిధ రంగాల్లో విశేష కృషి చేసిన వ్యక్తులను ప్రోత్సహించడం జరుగుతోందని మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. సమాజానికి సేవ చేసిన మహనీయుల వారసత్వాన్ని భావితరాలకు చేరవేయడం ఇలాంటి కార్యక్రమాల ప్రధాన ఉద్దేశమని అన్నారు.

Spread the love

Related News

Latest News