*ఉత్సవాలు శాంతియుతంగా జరుపుకోవాలని సూచన.
ప్రతిపక్షం చండూరు సెప్టెంబర్ 14: నల్గొండ జిల్లా చండూరు మున్సిపాలిటీ కేంద్రంలో వినాయక చవితి ఉత్సవాలు అత్యంత వైభవంగా, భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా మున్సిపాలిటీ పరిధిలోని శివాజీ నగర్ కాలనీలో ఏర్పాటు చేసిన వినాయక మండపాన్ని చండూరు ఎస్సై శివకుమార్ సందర్శించారు.శివాజీ నగర్ వినాయక ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణనాథుడికి ఎస్సై శివకుమార్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కమిటీ కుటుంబ సభ్యులతో కలిసి పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. రాష్ట్ర ప్రజలు, చండూరు మున్సిపాలిటీ ప్రజలు సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని స్వామివారిని వేడుకున్నారు.
*ఎస్సై శివకుమార్ మాట్లాడుతూ..
వినాయక చవితి ఉత్సవాలు శాంతియుతంగా, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జరుపుకోవాలని సూచించారు. శివాజీ నగర్ యూత్ ఐక్యతతో, క్రమశిక్షణతో ఉత్సవాలను నిర్వహిస్తున్న తీరు అభినందనీయమన్నారు. పోలీస్ శాఖ తరఫున పూర్తి సహకారం అందిస్తామని, నిమజ్జనం వరకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూసుకుంటామని భరోసా ఇచ్చారు. డీజే సౌండ్ విషయంలో నిబంధనలు పాటించాలని, ట్రాఫిక్ కు ఇబ్బంది కలగకుండా చూడాలని కమిటీ సభ్యులకు సూచించారు.
గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు మాట్లాడుతూ
తమ మండపానికి వచ్చి పూజలో పాల్గొన్న ఎస్సై శివకుమార్ గారికి శివాజీ నగర్ వినాయక ఉత్సవ కమిటీ కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. పోలీసుల సహకారంతో ఉత్సవాలను మరింత ఘనంగా నిర్వహిస్తామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో శివాజీ నగర్ వినాయక ఉత్సవ కమిటీ అధ్యక్షులు, యూత్ సభ్యులు, కాలనీ పెద్దలు, భక్తులు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.






























