జిల్లా ప్రజలకు, సిబ్బందికి వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన జిల్లా ఎస్పీ.
ప్రతిపక్షం నల్గొండ సెప్టెంబర్ 14: వినాయక నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా నల్గొండ జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన వినాయక విగ్రహం వద్ద సోమవారం జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్, ఐపీఎస్ ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, జిల్లాలో ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు.ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ మాట్లాడుతూ… జిల్లా ప్రజలకు, సిబ్బందికి వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. వినాయక నవరాత్రి ఉత్సవాలను ప్రతి ఒక్కరూ భక్తిశ్రద్ధలతో, పరస్పర గౌరవంతో, శాంతియుత వాతావరణంలో నిర్వహించుకోవాలని కోరారు.ఉత్సవాల సందర్భంగా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా పోలీస్ శాఖ తరఫున అవసరమైన అన్ని భద్రతా చర్యలు చేపడుతున్నామని తెలిపారు. ఉత్సవ కమిటీ సభ్యులు, నిర్వాహకులు పోలీస్ శాఖ సూచనలు, నిబంధనలు పాటిస్తూ ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించేందుకు సహకరించాలని సూచించారు. ప్రజలు పండుగను ఆనందంగా, సోదరభావంతో జరుపుకోవాలని, ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని జిల్లా ఎస్పీ కోరారు.ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ రమేష్, ఎస్.బి. సీఐ నాగరాజు, ఆర్.ఐలు సంతోష్, సూరప్ప నాయుడు, కళ్యాణ్ రాజ్, ఉత్సవ కమిటీ సభ్యులు, పోలీస్ అధికారులు మరియు సిబ్బంది పాల్గొన్నారు.

































