అష్టలక్ష్మీ సహిత లలితా పరమేశ్వరీ ఆలయంలో వైభవంగా ఉత్సవాలు
ప్రతిపక్షం ప్రతినిధి,సిద్ధిపేట, అక్టోబరు 15: మంగళవాయిద్యాలు.. మంత్రోచ్ఛారణలు.. భక్తుల పూజలు.. చండీ హోమంతో సిద్దిపేటలోని శ్రీ శ్రీ అష్టలక్ష్మీ సహిత లలితా పరమేశ్వరీ దేవాలయం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. శరన్నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా గురువారం అమ్మవారు శ్రీ లలితా త్రిపురసుందరీ దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మ వారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు.సిద్దిపేట పట్టణంలోని కాళ్ల కుంట కాలనీ లోని ఈ ఆలయంలో ఆలయం నిర్వాహకుడు జి. కిరణ్ కుమార్ ఆధ్వర్యంలో ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఆశ్వయుజ శుద్ధ పంచమి సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక అలంకరణ చేసి పూజలు నిర్వహించారు. భక్తులు భక్తిశ్రద్ధలతో పూజల్లో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు.
శ్రీచక్ర అధిష్ఠాన శక్తిగా అమ్మవారు
శ్రీ లలితా త్రిపురసుందరీ దేవి శ్రీచక్ర అధిష్ఠానశక్తిగా, పంచదశాక్షరీ మహామంత్రానికి అధిదేవతగా పూజలందుకుంటారని వైదిక నిర్వాహకుడు పూసాల వెంకటాచార్యులు తెలిపారు. అమ్మవారు చిరునవ్వుతో, వాత్సల్య రూపిణిగా చెరకు గడను చేతపట్టి భక్తులకు దర్శనమిచ్చారని పేర్కొన్నారు. ఇరువైపులా శ్రీలక్ష్మీదేవి, సరస్వతీదేవి వింజామరలతో సేవలందిస్తున్న అలంకారం భక్తులను ఆకట్టుకుంది. ఈ సందర్భంగా అమ్మవారిని మహా త్రిపుర సుందరీ దేవిగా, పరమేశ్వరుడిని మహాకామేశ్వరుడిగా ఆరాధించారు. ఆలయంలో చండీ హోమం నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందారు.
నేడు సరస్వతీదేవి అలంకారంలో దర్శనం
శుక్రవారం, అక్టోబరు 16వ తేదీన మూల నక్షత్రం సందర్భంగా అమ్మవారు సరస్వతీదేవి అలంకారంలో భక్తులకు దర్శనమివ్వనున్నారని ఆలయ నిర్వాహకుడు జి. కిరణ్ కుమార్, ప్రధాన అర్చకుడు కృపాకరాచార్యులు తెలిపారు. విద్యాభివృద్ధిని కోరుకునే భక్తులు అమ్మవారిని దర్శించుకోవాలని సూచించారు.శరన్నవరాత్రి మహోత్సవాలు అక్టోబరు 20 వరకు కొనసాగనున్నాయి. ఉత్సవాల సందర్భంగా ప్రతిరోజూ చండీ హోమం నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. భక్తులు ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులు కావాలని కోరారు.






























