సీసీ కెమెరాల పటిష్ట నిఘా…!

•పోగొట్టుకున్న బంగారం రికవరీ

•కానిస్టేబుల్ శివప్రసాద్ ను అభినందించిన ఎస్సై హరిప్రసాద్

వనపర్తి ప్రతినిధి, నవంబర్ 28(ప్రతిపక్షం): పోగొట్టుకున్న ఐదు తలా బంగారాన్ని సీసీ కెమెరాల ఆధారంగా గుర్తించి బాధితురాలికి తిరిగి అప్పగించి వనపర్తి పోలీసులు తమ బాధ్యతయుత సేవలను చాటుకున్నారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు తక్షణమే స్పందించి సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి బంగారు రికవరీ చేయడం అభినందనీయంగా నిలిచింది. వివరాల్లోకి వెళితే వనపర్తి పట్టణానికి చెందిన లలితమ్మ శుక్రవారం ఉదయం 8:30 గంటల సమయంలో బస్టాండ్ వెనుక ఉన్న మల్లికార్జున మెడికల్ షాప్ ముందు తన పర్సనల్ పోగొట్టుకున్నారు. అందులో ఐదు తులాల బంగారం ఉండడంతో శనివారం ఆమె పోలీస్ స్టేషన్ ను ఆశ్రయించారు.తక్షణమే స్పందించిన పోలీసులు సంఘటన స్థలంలోని సీసీ కెమెరాలు పరిశీలించగా ఓ వృద్ధురాలు పర్సును తీసుకెళ్లినట్లు గుర్తించారు.అనంతరం సివి రామన్ కళాశాల మార్గంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న సీసీ కెమెరాలు క్షుణ్ణంగా పరిశీలించి వృద్ధురాలి ఆచూకీ గుర్తించారు.ఆమె వద్ద నుంచి ఐదు తులాల బంగారాన్ని స్వాధీనం చేసుకొని బాధితురాలు లలితమ్మకు అప్పగించారు. ఫిర్యాదు అందిన వెంటనే స్పందించి సీసీ కెమెరాలు ద్వారా ఆధారాలు సేకరించి బంగారం రికవరీ చేయడంలో చొరవ చూపిన పోలీస్ కానిస్టేబుల్ శివప్రసాద్ ను పట్టణ ఎస్సై హరిప్రసాద్ అభినందించారు. ప్రజల సమస్యల పరిష్కారం లో పోలీసుల తక్షణ స్పందన బాధ్యతాయుత విధి నిర్వహణకు ఈ ఘటన నిదర్శనంగా నిలిచింది.

Related News

Latest News