ప్రతిపక్షం, నవంబర్ 22: ఫ్రాన్స్‌కు చెందిన ప్రముఖ విమాన ఇంజిన్ల తయారీ సంస్థ సఫ్రాన్ ఎయిర్‌క్రాఫ్ట్ ఇంజిన్స్ తెలంగాణలో భారీ పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపుతోంది. రాష్ట్రంలో సుమారు రూ.4,000 కోట్ల పెట్టుబడితో కొత్త తయారీ కేంద్రాలను ఏర్పాటు చేసే ప్రతిపాదనపై సంస్థ ప్రతినిధులు ప్రభుత్వంతో చర్చలు జరిపినట్లు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క వెల్లడించారు. ఈ పెట్టుబడులు కార్యరూపం దాల్చితే తెలంగాణలో ఏరోస్పేస్, విమాన ఇంజిన్ల విడిభాగాల తయారీ రంగాలకు మరింత ఊతం లభించడంతో పాటు రాష్ట్ర పారిశ్రామిక రంగంలో కీలక పురోగతి సాధించే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. వచ్చే నెలలో నిర్వహించనున్న ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్‌లో ఈ పెట్టుబడులకు సంబంధించి అవగాహన ఒప్పందం కుదిరే అవకాశముందని తెలిపారు.
ఫ్రాన్స్ పర్యటనలో భాగంగా ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క శనివారం పారిస్ సమీపంలోని సఫ్రాన్ ఎయిర్‌క్రాఫ్ట్ ఇంజిన్స్ తయారీ కేంద్రాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా సంస్థ ఉన్నతాధికారులతో సమావేశమై తెలంగాణలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలు, విమాన ఇంజిన్ల విడిభాగాల తయారీ, కొత్త పరిశ్రమల ఏర్పాటుపై విస్తృతంగా చర్చించారు. సంస్థ తయారీ కేంద్రంలో విమాన ఇంజిన్లకు సంబంధించిన వివిధ విడిభాగాల ఉత్పత్తి ప్రక్రియలను పరిశీలించారు. తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాలు, రాష్ట్రంలో ఉన్న పారిశ్రామిక మౌలిక సదుపాయాలు, హైదరాబాద్‌లో ఏరోస్పేస్ రంగానికి అనుకూలమైన వాతావరణం గురించి కంపెనీ ప్రతినిధులకు వివరించారు.
ప్రపంచవ్యాప్తంగా విమాన తయారీ రంగంలో ప్రముఖ సంస్థగా గుర్తింపు పొందిన సఫ్రాన్, బోయింగ్, ఎయిర్‌బస్ వంటి అంతర్జాతీయ విమాన తయారీ సంస్థలకు ఇంజిన్లు, వాటికి సంబంధించిన విడిభాగాలను సరఫరా చేస్తోంది. ఇలాంటి అంతర్జాతీయ సంస్థ తెలంగాణలో మరిన్ని పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావడం రాష్ట్ర పారిశ్రామిక అభివృద్ధికి కీలక పరిణామమని భట్టి విక్రమార్క అభిప్రాయపడ్డారు. సఫ్రాన్ ప్రతినిధులతో జరిగిన సమావేశం సానుకూలంగా సాగిందని, తెలంగాణలో తమ కార్యకలాపాలను విస్తరించేందుకు సంస్థ ఆసక్తి వ్యక్తం చేసిందని వెల్లడించారు. వచ్చే నెలలో హైదరాబాద్‌లో జరగనున్న ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్‌కు సఫ్రాన్ ప్రతినిధుల బృందాన్ని ఆహ్వానించినట్లు తెలిపారు.
సఫ్రాన్ సంస్థ ఇప్పటికే హైదరాబాద్‌లో పలు కీలక తయారీ కేంద్రాలను ఏర్పాటు చేసింది. లీప్ విమాన ఇంజిన్లకు సంబంధించిన తిరిగే విడిభాగాల తయారీ కేంద్రంతో పాటు విద్యుత్ పరికరాల తయారీ యూనిట్‌ను నిర్వహిస్తోంది. అంతేకాకుండా విమాన ఇంజిన్ల నిర్వహణ, మరమ్మతుల కోసం లీప్ ఎంఆర్వో కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేసింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ఇప్పటికే కొనసాగుతున్న కార్యకలాపాలను మరింత విస్తరించేందుకు సంస్థ ఆసక్తి చూపడం తెలంగాణ ఏరోస్పేస్ రంగానికి కొత్త అవకాశాలను తీసుకురానుంది.
ఈ పెట్టుబడి ప్రతిపాదన అమలులోకి వస్తే విమాన ఇంజిన్ల విడిభాగాల తయారీ, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగం, నైపుణ్యాభివృద్ధి, ఉపాధి కల్పన వంటి రంగాల్లో తెలంగాణకు ప్రయోజనం చేకూరనుంది. రాష్ట్రంలో ఏరోస్పేస్ పరిశ్రమలకు అవసరమైన అనుబంధ సంస్థలు, సరఫరా వ్యవస్థలు కూడా విస్తరించే అవకాశముంది. ఈ పర్యటనలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో పాటు రాష్ట్ర పరిశ్రమల శాఖ కమిషనర్ నిఖిల్ చక్రవర్తి, సఫ్రాన్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ లారెంట్ మజౌ తదితరులు పాల్గొన్నారు.























