ప్రతిపక్షం, నవంబర్ 20: తెలంగాణలో పోలీసు ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు కీలక సమాచారం వెలువడింది. ఎస్సై ప్రాథమిక రాతపరీక్షకు సంబంధించిన హాల్‌టికెట్లను తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీసు నియామక మండలి విడుదల చేసింది. నవంబర్ 22వ తేదీ ఉదయం 8 గంటల నుంచి అభ్యర్థులు హాల్‌టికెట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చని వెల్లడించింది. పోలీసు నియామక మండలి అధికారిక వెబ్సైట్ www.tgprb.in ద్వారా హాల్‌టికెట్లు పొందవచ్చని సూచించింది. నవంబర్ 28వ తేదీ అర్ధరాత్రి 12 గంటల వరకు డౌన్లోడ్ చేసుకునేందుకు అవకాశం కల్పించింది. అభ్యర్థులు చివరి నిమిషం వరకు వేచి చూడకుండా ముందుగానే హాల్‌టికెట్లు డౌన్లోడ్ చేసుకుని, వాటిలోని వివరాలను సరిచూసుకోవాలని సూచించింది.
మొత్తం 275 సివిల్ ఎస్సై, సమాన స్థాయి పోస్టుల భర్తీకి నవంబర్ 29వ తేదీన ప్రిలిమినరీ రాతపరీక్ష నిర్వహించనున్నారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పరీక్ష జరగనుంది. ఈ ఉద్యోగాల కోసం మొత్తం 1,60,712 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు హాల్‌టికెట్‌పై ఉన్న సూచనలను పూర్తిగా చదవాలని నియామక మండలి సూచించింది. నియామక ప్రక్రియ పూర్తయ్యే వరకు హాల్‌టికెట్‌ను భద్రంగా ఉంచుకోవాలని స్పష్టం చేసింది.
ఈసారి అభ్యర్థులు తెలుగు, ఇంగ్లీష్, ఉర్దూ మూడు భాషల్లో పరీక్ష రాసే అవకాశం కల్పించారు. దరఖాస్తు సమయంలో అత్యధికంగా 56.84 శాతం మంది అభ్యర్థులు తెలుగు మాధ్యమాన్ని ఎంచుకున్నారు. 43.02 శాతం మంది ఇంగ్లీష్‌లో పరీక్ష రాసేందుకు మొగ్గుచూపగా, 0.12 శాతం మంది ఉర్దూ మాధ్యమాన్ని ఎంపిక చేసుకున్నారు. దీంతో ఈ పరీక్షలో తెలుగు మాధ్యమానికి ప్రాధాన్యత ఎక్కువగా ఉన్నట్లు స్పష్టమవుతోంది.
పోస్టుల వివరాలను పరిశీలిస్తే సివిల్ ఎస్సై విభాగంలో 148 ఖాళీలు, ఆర్మ్డ్ రిజర్వ్ ఎస్సై విభాగంలో 14, టీజీఎస్పీ ఎస్సై విభాగంలో 12, ఎస్ఏఆర్సీపీఎల్ విభాగంలో 3 పోస్టులు ఉన్నాయి. వీటితో పాటు ఫింగర్ ప్రింట్ బ్యూరోలో ఏఎస్సై పోస్టులు 23 భర్తీ చేయనున్నారు. మొత్తం 275 పోస్టుల కోసం నియామక ప్రక్రియ కొనసాగుతోంది.
మరోవైపు ఈసారి ప్రిలిమినరీ పరీక్షలో అర్హత సాధించేందుకు అవసరమైన కనీస మార్కుల్లోనూ మార్పులు చేశారు. మొత్తం 200 మార్కులకు నిర్వహించే పరీక్షలో ఓసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు కనీసం 30 శాతం అంటే 60 మార్కులు సాధించాలి. బీసీ అభ్యర్థులకు 25 శాతం అంటే 50 మార్కులు, ఎస్సీ, ఎస్టీ, మాజీ సైనిక ఉద్యోగులు, హోంగార్డులకు 20 శాతం అంటే 40 మార్కులను కనీస అర్హతగా నిర్ణయించారు. గత 2022 నియామక ప్రక్రియలో అభ్యర్థులందరికీ 30 శాతం కనీస అర్హత మార్కులుగా ఉండగా, ఈసారి వివిధ వర్గాలకు వేర్వేరు అర్హత మార్కులు నిర్ణయించడం గమనార్హం. పరీక్షకు సిద్ధమవుతున్న అభ్యర్థులు హాల్‌టికెట్ల విడుదల తేదీ, పరీక్ష సమయం, అర్హత మార్కుల వివరాలను గమనించి తగిన ఏర్పాట్లు చేసుకోవాలి.




























