ప్రతిపక్షం, ఆగస్టు 07: భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డికి తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ)లో కీలక బాధ్యతలు అప్పగించారు. పార్టీ రాష్ట్ర మీడియా & పబ్లిసిటీ విభాగం ఛైర్‌పర్సన్‌గా ఆయనను నియమిస్తూ కాంగ్రెస్ అధిష్ఠానం నిర్ణయం తీసుకుంది.
ఈ కొత్త బాధ్యతల్లో భాగంగా కాంగ్రెస్ పార్టీ ప్రచార వ్యూహాలను రూపొందించడం, మీడియాతో సమన్వయం చేయడం, పార్టీ కార్యక్రమాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లడం వంటి కీలక అంశాలను చామల కిరణ్ కుమార్ రెడ్డి పర్యవేక్షించనున్నారు.
అలాగే రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు చేరవేయడం, పార్టీ తరఫున మీడియా వ్యవహారాలను సమర్థంగా నిర్వహించడం, రాజకీయ అంశాలపై పార్టీ వైఖరిని ప్రజలకు వివరించడం వంటి బాధ్యతలను కూడా ఆయన నిర్వర్తించనున్నారు.
లోక్‌సభ సభ్యుడిగా కొనసాగుతున్న చామల కిరణ్ కుమార్ రెడ్డికి పార్టీ సంస్థాగతంగా కూడా కీలక బాధ్యతలు అప్పగించడం కాంగ్రెస్‌లో ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ నియామకంతో పార్టీ ప్రచార కార్యక్రమాలు మరింత బలోపేతం అవుతాయని కాంగ్రెస్ నాయకులు భావిస్తున్నారు.

















