[t4b-ticker]

రాష్ట్రాన్ని ముంచెత్తిన వర్షాలు.. 12 జిల్లాలకు రెడ్ అలర్ట్

  • 587 మండలాల్లో వర్షం.. స్తంభించిన జనజీవనం
  • పొంగి పొర్లుతున్న వాగులు, చెరువులు, రహదారులపైకి వరద నీరు
  • వరదల్లో మహిళ మృతి.. జంపన్నవాగులో మరో వ్యక్తి గల్లంతు
  • సింగరేణిలో బొగ్గు ఉత్పత్తికి తీవ్ర అంతరాయం
  • నేడు, రేపు భారీ నుంచి అతి భారీ వర్షాల హెచ్చరిక

ప్రతిపక్షం బ్యూరో, ఉత్తర తెలంగాణ, జూలై 31: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో తెలంగాణ రాష్ట్రం వర్షాల మోతలో చిక్కుకుంది. మంగళవారం రాత్రి నుంచి బుధవారం వరకు ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలతో రాష్ట్రవ్యాప్తంగా జనజీవనం అస్తవ్యస్తమైంది. వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహించగా, చెరువులు నిండుకుండలా మారాయి. పలు ప్రాంతాల్లో రహదారులపైకి వరద నీరు చేరడంతో రాకపోకలు నిలిచిపోయాయి. పంట పొలాలు నీటమునిగి రైతులు తీవ్రంగా నష్టపోయారు.

తెలంగాణలోని 621 మండలాల్లో వర్షపాతం నమోదైంది. వీటిలో 30 మండలాల్లో 10 నుంచి 20 సెంటీమీటర్ల వరకు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిశాయి. నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలంలోని బల్లివాగు దాటే ప్రయత్నంలో గిరిజన మహిళ మర్సుకోల పారుబాయి (50) వరదలో కొట్టుకుపోయి మృతి చెందగా, ములుగు జిల్లా మేడారం సమీపంలోని జంపన్నవాగులో పుణ్యస్నానం చేస్తుండగా ఘట్‌కేసర్‌కు చెందిన పీట్ల తిమ్మయ్య (45) గల్లంతయ్యాడు. పోలీసులు గాలింపు చర్యలు కొనసాగిస్తున్నా అతడి ఆచూకీ లభించలేదు.ములుగు జిల్లా వాజేడు మండలంలోని ఇసుకవాగు ఉప్పొంగడంతో జాతీయ రహదారి-163పైకి వరద నీరు చేరి రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. చీకుపల్లి వద్ద బొగత జలపాతం ఉద్ధృతంగా ప్రవహిస్తుండటంతో పర్యాటకుల ప్రవేశాన్ని నిలిపివేశారు. నిర్మల్ జిల్లా సోన్–ధర్మారం ప్రధాన రహదారి దెబ్బతినగా, పెంబి మండలంలో కడెం వాగు ప్రమాదస్థాయిలో ప్రవహిస్తోంది. ఎగువ ప్రాంతాల నుంచి వరద ప్రవాహం పెరగడంతో భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది.

సింగరేణిలో బొగ్గు ఉత్పత్తికి తీవ్ర అంతరాయం

భారీ వర్షాలతో జయశంకర్ భూపాలపల్లి, మంచిర్యాల జిల్లాల్లోని సింగరేణి ఓపెన్‌కాస్ట్ గనుల్లో బొగ్గు ఉత్పత్తి దెబ్బతింది. భూపాలపల్లిలోని ఓసీ-2, ఓసీ-3 గనుల్లో ఉత్పత్తి పూర్తిగా నిలిచిపోగా సంస్థకు సుమారు రూ.9 కోట్ల నష్టం వాటిల్లినట్లు అధికారులు అంచనా వేశారు. మల్హర్ మండలంలోని తాడిచర్ల ఓపెన్‌కాస్ట్‌లో 18 వేల మెట్రిక్ టన్నుల ఉత్పత్తి నిలిచిపోయింది. మంచిర్యాల జిల్లాలోనూ గనుల్లోకి భారీగా వర్షపు నీరు చేరడంతో యంత్రాలు నిలిచిపోయి బొగ్గు ఉత్పత్తికి తీవ్ర అంతరాయం ఏర్పడింది.

12 జిల్లాలకు రెడ్ అలర్ట్

అల్పపీడన ప్రభావం కొనసాగుతున్న నేపథ్యంలో గురు, శుక్రవారాల్లో రాష్ట్రవ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఆదిలాబాద్, కుమురంభీం ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి, రాజన్న సిరిసిల్ల, జగిత్యాల, కరీంనగర్, పెద్దపల్లి, మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో 20 నుంచి 40 సెంటీమీటర్ల వరకు వర్షపాతం నమోదయ్యే అవకాశముందని పేర్కొంటూ ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. మిగిలిన జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని, వాగులు, వంకలు దాటే ప్రయత్నం చేయవద్దని, లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

Spread the love

Related News

Latest News